ప్రభాస్‌తో నాకున్న అనుబంధం ఇదే… టీటీఏ మెగా కన్వెన్షన్‌లో నవీన్ పోలిశెట్టి సీక్రెట్స్ రివీల్
చార్లెట్లో జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో నవ్వులు పూయించారు. యాంకర్లు రవి, సుమతో కలిసి వేదికపై ఆయన చేసిన కామెడీ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. తనకు అమెరికాతో, ముఖ్యంగా చార్లెట్‌తో ఉన్న అనుబంధాన్ని హాస్యంతో జోడించి ఆయన చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాను బర్త్ వీసా మీద వచ్చానని, చార్లెట్ తన జన్మస్థలం అని ఆయన సరదాగా చెప్పిన మాటలు ఆడిటోరియంలో నవ్వులు నింపాయి. “నేను పుట్టిన ఊరు ఇదే. యూఎస్‌లో ట్రాఫిక్ ఎక్కువైపోవడంతో ఇండియాకు వెళ్లాల్సి వచ్చింది” అంటూ చమత్కరించారు. రెబెల్ స్టార్ ప్రభాస్‌తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా… వారిద్దరి స్నేహం నవీన్ స్పందించారు. తమ ఇద్దరిదీ ఇప్పటి స్నేహం కాదని, చిన్ననాటి మిత్రులమని చెప్పారు. ప్రభాస్‌తో ఉన్న అనుబంధం, తమ ఫ్రెండ్షిప్ ముచ్చట్ల గురించి చెప్పాలంటే ఒక గంట పాడ్‌కాస్ట్ కూడా సరిపోదని అన్నారు.
తన సినిమాల విజయ ప్రయాణంలో అమెరికా ప్రేక్షకుల పాత్ర ఎంతో ఉందని నవీన్ గుర్తు చేసుకున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సమయంలో ఇండియాలో షోలు దొరకని కష్టకాలంలో, అమెరికా ప్రేక్షకులు చూపిన ఆదరణే తనని స్టార్‌ను చేసిందని అన్నారు. తన ప్రతి సినిమాకి మొట్టమొదటి షో అమెరికాలోనే పడుతుందని, ఇక్కడి ప్రేక్షకుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి సినిమా తర్వాత అమెరికా వచ్చి ప్రేక్షకులను పర్సనల్‌గా కలవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఆయన చెప్పారు. మొత్తానికి, తన చమత్కారంతో నవీన్ పోలిశెట్టి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.








