ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు : మంత్రి దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు వచ్చినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) వెల్లడించారు. జైపూర్ (Jaipur)లో నిర్వహించిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్ వేదికగా ఈ అవార్డును మంత్రి అందుకున్నారు. ఈ సందర్భంగా దుర్గేశ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఏపీలోని అద్భుతమైన బీచ్‌లు (Beaches), ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, లగ్జరీ రిసార్టులు (Luxury Resorts), ఆధునిక మౌలిక వసతులు డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహణకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను ప్రోత్సహించే దిశగా అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడం, పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పర్యాటకాన్ని ప్రచారం చేయడం వంటి కార్యక్రమాల ఫలితంగానే ఈ అవార్డు దక్కిందన్నారు.








