గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి అండగా ప్రభుత్వం..!
ఇటీవల కాశీబుగ్గలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష బాధిత దానయ్య కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును నేతలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
కొద్దిరోజుల క్రితం కాశీబుగ్గ పరిధిలో జరిగిన బైక్ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మాజీ మంత్రి, వైసీపీ(ycp) నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన ‘ర్యాష్ డ్రైవింగ్’ (అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్) వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అమాయకుడైన గొర్రెల కాపరి ప్రాణం పోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలాసాల కోసం మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ ఒక పేద కుటుంబంలో విషాదం నింపిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన అనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో చట్టం ఎవరికైనా ఒక్కటేనని, తప్పు చేసిన వారు ఎంతటి రాజకీయ నేపథ్యం ఉన్న వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దానయ్య మృతికి కారణమైన వారిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారని, ఖచ్చితంగా న్యాయపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షల సాయం ఆ కుటుంబానికి కొంతైనా అండగా నిలుస్తుందని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు.








