సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi)ని పోలీసులు అదపుపులోకి తీసుకున్నారు. రాహుల్ అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంగారెడ్డిలో నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి (Sangareddy)లోని పోతిరెడ్డిపల్లి వద్ద అరవై అయిదో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అక్కడికి చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.








