మూడు సంవత్సరాల మిస్టరీ!
— శివ దువ్వూరు
ఒక్క ఉదయం…
మీరు ఎప్పటిలాగే నిద్ర లేచారు. అలవాటుగా ఫోన్ చేతిలోకి తీసుకున్నారు. స్క్రీన్ మీద డేట్ చూసి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.
22 జూలై… 2029.
ఏదో తప్పు జరిగింది.
నిన్న పడుకున్నప్పుడు… 2026
ఈరోజు లేచేసరికి… 2029.
మూడు సంవత్సరాలు. ఒక్క రాత్రిలో గడిచిపోయాయా. మొదట నవ్వొచ్చింది. ఫోన్ హ్యాంగ్ అయిందనుకున్నారు. టీవీ ఆన్ చేశారు. అక్కడ కూడా అదే తేదీ. బయటకు వెళ్లారు. మీకు తెలిసిన చిన్న పిల్లాడు… ఇప్పుడు కాలేజీ బ్యాగ్ వేసుకుని బైక్ మీద వెళ్తున్నాడు.
మీ నాన్న జుట్టంతా తెల్లబడిపోయింది. మీ అమ్మ కళ్లజోడు లేకుండా మిమ్మల్ని కూడా సరిగా గుర్తుపట్టలేకపోతోంది. ఇంట్లో గోడ మీద…మూడు క్యాలెండర్లు ఉన్నాయి. 2027…2028…2029…
మీ చేతులు వణికాయి. మీకు ఆ మూడు సంవత్సరాలు గుర్తులేవు. ఏం జరిగింది? జ్ఞాపకశక్తి పోయిందా?
ఫోన్ గ్యాలరీ తెరిచి చూసారు. ఫోటోలు ఉన్నాయి. మూడేళ్ల పుట్టినరోజులు ఉన్నాయి. కుటుంబంతో ట్రిప్స్ ఉన్నాయి. ఆఫీస్ సెల్ఫీలు ఉన్నాయి. మూడేళ్లు జీవితం నడిచిన ఆధారాలన్నీ ఉన్నాయి. తన మొహం లోనూ మూడేళ్లలో మార్పు వచ్చింది. కానీ ఎందుకు ఏమీ మారినట్లు అనిపించటం లేదు. ఎందుకంటే మీ జీవితంలో ఈ మూడేళ్లు ఏమీ జరగలేదు కాబట్టి.
2026లో మీ జీవితం ఎలా ఉందో .2029లో కూడా దాదాపు అలాగే ఉంది. అదే ఉద్యోగం. అదే ఇల్లు. అదే సమస్యలు. అవే భవిష్యత్తు కలలు. అప్పుడే మీకు అర్థమైంది. కాలం కనిపించకుండా పోలేదు. మీ జీవితంలో మూడేళ్లు మిస్ కాలేదు. నిజానికి గుర్తుపెట్టుకునేంతగా..చెప్పుకునేంతగా మీ జీవితంలో కొత్తగా ఏమీ జరగలేదు. ఇదే మనలో చాలామంది బతుకుతున్న జీవితం.
ప్రతి రోజు లేస్తాం. సంపాదనకి వెళ్తాం. తిరిగి వస్తాం. నిద్రపోతాం.మళ్లీ అదే. రోజులు మారుతాయి. నెలలు మారుతాయి. సంవత్సరాలు మారిపోతాయి. అయితే మన జీవితంలో మార్పు మాత్రం రాదు. ఎందుకంటే మనం కొన్ని మాటలు పట్టుకుని బతుకుతున్నాం కాబట్టి. అదే ..
“కొంచెం టైమ్ దొరికాక…చేస్తాను”
“ఈ నెల అయిపోనివ్వు…”
“సరైన అవకాశం వచ్చిన తర్వాత… చూద్దాం” అని. ఒకరోజు అన్నీ సెట్ అవుతాయని అనుకుంటాం. కానీ కాలం…ఎవరి కోసం ఆగదు. ప్రపంచం ప్రతి క్షణం మారుతోంది. టెక్నాలజీ మారుతోంది. ఉద్యోగాలు మారుతున్నాయి. మన చుట్టూ ఉన్న వాళ్లు మారుతున్నారు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళీలా అక్కడే ఉంటాం. అదే చోట నిలబడి ఉంటాం. నిజానికి… అది నిలబడి ఉండటం కాదు. నెమ్మదిగా వెనుకబడటం. ఎందుకిలా మనం ఆగిపోతాం. వాయిదాలు వేస్తూంటామో తెలుసా..మనలో ఉన్న ఒక భయం మనల్ని వెనక్కి లాగేస్తుంది.
మనల్ని ఎక్కువగా భయపెట్టే ప్రశ్న ఏంటో తెలుసా?
“ఫెయిలైతే?” అనే ఒక్క పదం మన జీవితాన్ని భయాలతో నింపేస్తుంది. ఉద్యోగం మార్చాలనుకున్నా, బిజినెస్ మొదలుపెట్టాలనుకున్నా, కొత్తదేదైనా నేర్చుకోవాలనుకున్నా…ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఆపేస్తుంది.
తెనాలి సినిమాలోలా కమల్ హాసన్ క్యారక్టర్ లా ..మనకు రకరకాల భయాలు. ఏదన్నా చేస్తే డబ్బు పోతుందనే భయం., జనం నవ్వుతారనే భయం, పడితే లేవలేవేమో అనే భయం ఇలా బోలెడు భయాలు మనల్ని ముందుకు వెళ్లనీయకుండా వెనక్కి లాగేస్తూంటాయి.
అయితే దీనికో పరిష్కారం ఉంది. భయానికి భయమే విరుగుడులా..ఇలాంటి వాటికి మరో ప్రశ్నే సమాధానం. ఆ ప్రశ్నే “ఇంకో మూడు సంవత్సరాలు… అంటే సుమారు వెయ్యి రోజులు… తర్వాత మనము ఏమౌతాం, అప్పటికి జీవితంలో ఏమీ మారకపోతే? ఏంటి పరిస్ధితి అని”
ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే…చాలా నిర్ణయాలు వాటంతట అవే మారిపోతాయి. ఈరోజు ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే… వెయ్యి రోజుల తర్వాత మీరు అదే వ్యక్తి కాదు. ఇంకా బలహీనమైన వ్యక్తి. ఈరోజు మీకు నచ్చని ఉద్యోగంలోనే కొనసాగితే… వెయ్యి రోజుల తర్వాత మీ అనుభవం పెరిగి ఉండొచ్చు.కానీ… మీ అవకాశాలు తగ్గిపోయి ఉండొచ్చు. ఈరోజు వాయిదా వేసిన ప్రతి నిర్ణయం… వెయ్యి రోజుల తర్వాత…మీ భవిష్యత్తులో వెనక్కి తీయలేని అడుగుగా, ఒక శాశ్వత ముద్రగా మారుతుంది.
1000 రోజుల లైఫ్ టెస్ట్
ఇప్పుడే ఒక పేపర్, పెన్ తీసుకోండి. నిజాయితీగా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాసుకోండి:
ఆరోగ్యం: ఇప్పుడున్న తినే, పడుకునే అలవాట్లే కొనసాగితే… 1000 రోజుల తర్వాత నా శరీరం ఎలా ఉంటుంది?
బ్యాంక్ బ్యాలెన్స్: ఇప్పుడున్న ఖర్చులు, సేవింగ్స్ అలవాట్లే ఉంటే… 1000 రోజుల తర్వాత నా బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుంది?
కరీర్/ఉద్యోగం: కొత్తగా ఏమీ నేర్చుకోకుండా ఇదే సాలరీతో పనిచేస్తే… 1000 రోజుల తర్వాత నా ఉద్యోగ భద్రత ఎంత?
కుటుంబం: నా అలవాట్లు, నా ప్రవర్తన ఇలాగే ఉంటే… 1000 రోజుల తర్వాత నా కుటుంబంలో నా గౌరవం ఎంత?
ఈ ప్రశ్నలకు సమాధానాలు మిమ్మల్ని భయపెడుతున్నాయా? అయితే మిమ్మల్ని మీరు మార్చుకుని ముందుకు వెళ్లాలి.
“వన్-లీవర్” రూల్ వాడండి!
చాలామంది ఒకే రోజులో జీవితాన్ని మార్చేయాలని చూస్తారు. రేపటి నుంచి 5 గంటలకే లేవాలి, గంట వ్యాయామం చేయాలి, డైటింగ్ చేయాలి, 10 గంటలు చదవాలి… అని లిస్ట్ రాస్తారు. రెండు రోజుల్లో తుస్సమని పాత జీవితంలోకి వెళ్ళిపోతారు.
దీనికి పరిష్కారం: ఒక్క అలవాటు – 21 రోజులు!
మీ జీవితాన్ని మార్చే ఒక్క పవర్ ఫుల్ అలవాటును ఎంచుకోండి. దాన్ని 21 రోజుల పాటు నాన్-స్టాప్‌గా కాపాడుకోండి.
చూడండి… ఒకే ఒక్క మంచి అలవాటు డొమినో ఎఫెక్ట్‌లా మిగతా అన్నింటినీ ఎలా మారుస్తుందో
ఏదైమైనా
ఇప్పుడు మళ్లీ మొదటకి వెళ్లండి.
మీకు ఆ మూడు సంవత్సరాలు గుర్తులేకపోవడానికి అసలు కారణం మీకు ఇప్పుడు అర్దమైంది. సమస్య మీ జ్ఞాపకశక్తి ది కాదు. ఆ మూడు సంవత్సరాల్లో గుర్తుంచుకోవాల్సినంత కొత్తగా ఏమీ జరగకపోవటం, గుర్తుపెట్టుకునేంతగా ఏమీ జరగకపోవటమే అసలు సమస్య.
మన జీవితంలో ప్రతి రోజూ గడిచిపోదు. చాలా రోజులు…ఒకదానిలో ఇంకొకటి కలిసిపోతాయి. వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఒకే రోజును మూడు సంవత్సరాలు చూసినట్టే అనిపిస్తుంది.
“కాలం సంవత్సరాలను దొంగిలించదు. మార్పు లేని రోజులను… జ్ఞాపకం లేని సంవత్సరాలుగా మార్చేస్తుంది”.








