ఈ అబద్ధాన్ని నమ్ముతున్నంత కాలం… మీరు బరువు తగ్గరు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీ శరీరం మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు.
కానీ… దాని గురించి మీరు నమ్ముతున్న ఒక అబద్ధం మాత్రం ప్రతిరోజూ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. అందుకే ఎంత డైట్ చేసినా ఎన్ని జిమ్‌లు మారినా ఎంత డబ్బు ఖర్చు చేసినా కోట్ల మంది బరువు తగ్గలేకపోతున్నారు.
ఆ అబద్ధాన్ని…ఒక మహిళ కూడా ఏళ్ల తరబడి నిజమే అనుకుంది. దాంతో ఆమె కూడా మిగతా వాళ్లలాగే బరవు తగ్గే విషయంలో ఫెయిలైంది. కానీ ఆమె అక్కడితో ఆగిపోలేదు.నిరాశపడలేదు. ఎందుకిలా ఫెయిలవుతున్నాను అని సమస్య మూలాల్లోకి వెళ్లి ఆలోచించింది.దాంతో ఆమెకు ఒకరోజు ఒక విషయం అర్థమైంది. ఇంతకాలం తాను బరువుతో పోరాడ లేదని ప్రపంచం నమ్మిస్తూన్న ఒక అబద్దంతో పోరాడుతున్నానని.
అది అర్దమైన మరుక్షణం తన సొంత ఆలోచనలతో బరువు తగ్గేందుకు ప్లాన్ చేసుకుంది.అందుకోసం ఆమె డైట్ మార్చలేదు.జిమ్ మార్చలేదు.మందులు మార్చలేదు. మార్చింది ఒక్క ఆలోచన మాత్రమే.ఆ ఒక్క మార్పు…ఆమె శరీరంలో ఊహించని మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆమె గుర్తించిన ఆ అబద్దం ఏమిటి?
మనం నమ్మే పెద్ద అబద్దం
ప్రపంచంలోని కోట్ల మంది ఇప్పటికీ నమ్మే ఓ అపోహ లేదా అబద్దం…”బరువు తగ్గాలంటే ప్రత్యేకమైన డైట్ కావాలి.”, “జిమ్‌కు వెళ్లకపోతే ఫలితం ఉండదు.”, “ఖరీదైన సప్లిమెంట్లు లేకుండా శరీరం మారదు.”. సోషల్ మీడియా కూడా దాదాపు ప్రతిరోజూ ఇదే చెబుతుంది. మీరు కొత్తగా మారాలంటే…కొత్త డైట్. కొత్త డ్రింక్.కొత్త పౌడర్.కొత్త వ్యాయామం. ప్రతి వారం ఒక కొత్త అద్భుతం జరగాలి.
అయితే ఓ విషయం మనం అర్దం చేసుకోవాలి. మన శరీరానికి ఈ ట్రెండ్స్ అంటే లెక్కలేదు. దానికి అవన్నీ అనవసరం.దానికి వైరల్ వీడియోలు తెలియవు.ఇన్స్టాగ్రామ్ రీల్స్ తెలియవు.అది పాటించేది వేల సంవత్సరాలుగా మారని కొన్ని జీవశాస్త్ర సూత్రాలనే.అదే విషయాన్ని పర్ల్ కూడా అర్థం చేసుకుంది.
ఆమె బరువు తగ్గటం కోసం కొత్త మార్గాల ని వెతకడం ఆపేసింది. దానికి బదులుగా…శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం మొదలుపెట్టింది. అక్కడే ఆమె ప్రయాణం మారిపోయింది.78 కిలోలతో ప్రారంభమైన ఆమె వెయిట్ లాస్ జర్నీ, ఆరు నెలలు తిరిగేసరికి 65 కిలోల దగ్గర ఆగింది.
View this post on Instagram
మొదట ఆమె తెలుసుకున్న విషయం
శరీరానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. మనం తిన్న ఆహారం ద్వారా ఎంత శక్తి వచ్చింది? రోజంతా ఎంత శక్తి ఖర్చైంది? ఈ రెండు లెక్కలే దానికి ముఖ్యం. ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ శక్తి వస్తే…శరీరం దాన్ని కొవ్వుగా నిల్వ చేస్తుంది. ఖర్చు చేసిన దానికంటే కొంచెం తక్కువ శక్తి వస్తే…ఇప్పటికే నిల్వ చేసిన కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. దీనినే శాస్త్రీయంగా క్యాలరీ డెఫిసిట్ అంటారు. వింటే చాలా సాధారణంగా అనిపిస్తుంది. అదే డైటింగ్ లో అత్యంత కీలకం. సాధారణంగా అనిపించే విషయాలను మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం.
ఇవి కూడా చదవండి
పర్ల్ మాత్రం అలా చేయలేదు. దాంతో ఆమె అన్నాన్ని శత్రువుగా చూడలేదు.రొట్టెను ప్రక్కన పెట్టేయలేదు. ఏ ఆహారాన్నీ పూర్తిగా వదిలేయలేదు. తన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినకుండా చూసుకుంది. అంతే చేసింది. మరి అక్కడితో ఆపేసిందా. అంటే ఇంకో అలవాటు కూడా ఆమె మార్చుకుంది.
రెండో మార్పు
ఆమెకు మననందరిలాగే ఓ అలవాటు ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేస్తూండాలి, పోస్తూండాలి. అవి చూడటానికి చిన్న చిన్న స్నాక్సే. కానీ అవి ఇచ్చే క్యాలరీలు ఎక్కువ అని అర్దం చేసుకుంది. అలాగే రాత్రి ఆలస్యంగా భోజనం. ఇది చాలామందికి తెలియకుండానే అలవాటైపోతుంది. పర్ల్ మాత్రం తన భోజనాన్ని ఒక నిర్ణీత సమయానికి పరిమితం చేసింది. ఆరు గంటల వ్యవధిలోనే ఆహారం తీసుకోవటం మొదలెట్టింది.మిగిలిన సమయాన్ని శరీరానికి విశ్రాంతి ఇచ్చింది. ఈ పద్ధతినే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అయితే… ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక మ్యాజిక్ కాదు. అది ఒక్కటే బరువు తగ్గించదు. మొత్తం జీవనశైలిలో భాగంగా పాటించినప్పుడే ఉపయోగపడుతుంది.
మూడో మార్పు
ఆమె చేసిన మూడో మార్పు ఇంకా ఆశ్చర్యకరమైనది. జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చలేదు. ఖరీదైన పరికరాలు కొనలేదు. రోజుకు పదివేల నుంచి పన్నెండువేల అడుగులు నడిచింది. అంతే. చిన్నగా కనిపించే ఈ అలవాటు…ఆరు నెలల్లో పెద్ద ఫలితాన్ని ఇచ్చింది.ఎందుకంటే…శరీరం ఒక్కరోజు చేసిన కష్టాన్ని గుర్తుంచుకోదు.ప్రతిరోజూ చేసిన అలవాటునే గుర్తుంచుకుంటుంది.
ఇక్కడే చాలా మంది ఓడిపోతారు. మూడు రోజులు కఠినమైన డైట్ చేస్తారు. నాలుగో రోజు అలసిపోతారు. ఐదో రోజు వదిలేస్తారు. తర్వాత… “నా వల్ల కాదు.” అని నిర్ణయించుకుంటారు. పర్ల్ అలా చేయలేదు. ఆమె ప్రతిరోజూ పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నించలేదు. నిలకడగా ఉండాలని మాత్రమే ప్రయత్నించింది. అదే ఆమెకు అసలు విజయాన్ని ఇచ్చింది.
ఆరు నెలల తర్వాత గ్యాస్ సిలిండర్ అంత బరువు!
ఈ ప్రయాణంలో అసలైన విలన్ ఆకలి కాదు… వెయింగ్ మెషిన్! ఒకరోజు 300 గ్రాములు తగ్గినట్లు చూపిస్తే, మరుసటి రోజు మళ్లీ 400 గ్రాములు పెరిగినట్టు చూపిస్తుంది. సాధారణంగా చాలామంది ఇక్కడే అధైర్యపడి మానేస్తారు.
కానీ పర్ల్ రోజూ వెయింగ్ మెషిన్ మీద కనిపించే సంఖ్యలను చూసి కంగారు పడలేదు. వారానికి సగటున అరకిలో చొప్పున మాత్రమే తగ్గుతూ వచ్చింది. ఆరు నెలల పాటు ఈ అలవాట్లను ఆపకుండా కొనసాగించేసరికి… ఆ చిన్న చిన్న మార్పులే 13 కిలోల తగ్గుదలకు కారణమయ్యాయి. 13 కిలోలు అంటే తక్కువేమీ కాదు, మన ఇంట్లో ఉండే ఒక గ్యాస్ సిలిండర్ ఎత్తితే ఎంత బరువు ఉంటుందో అంత కొవ్వును ఆమె తన శరీరం నుంచి తగ్గించుకుంది!
ఈ కథ చెప్పే పెద్ద నిజం కూడా అదే.
బరువు తగ్గడం…ఒక రహస్య టెక్నిక్ కాదు. ఒక వైరల్ డైట్ గురించి కాదు. ప్రతిరోజూ శరీరానికి అనుకూలంగా తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ఫలితం. మనలో చాలామంది ఓడిపోతున్నది కూడా అక్కడే. మనం శరీరాన్ని మార్చాలని,నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాం. మారాల్సింది మాత్రం… మన అలవాట్లు.
గమనిక: ఇది పర్ల్ పంచుకున్న వ్యక్తిగత అనుభవాన్ని, అలాగే క్యాలరీ డెఫిసిట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, రోజువారీ నడకపై అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను సమన్వయం చేసి రూపొందించిన కథనం. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఇలాంటి ఆహార మార్పులు ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించాలి.








