ట్విన్ టవర్స్ విషాదం తరహా దాడులు.. యుద్ధం ఆపకుంటే విపరిణామాలన్న ఇరాన్.. !
అమెరికాకు ఇరాన్ డెడ్లీ వార్నింగిచ్చింది. తమపై యుద్ధం ఆపకుంటే.. ట్విన్ టవర్స్ తరహా దాడులకు సిద్ధం కావాలని హెచ్చరించింది.హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఓ వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. వాటికి ఐఆర్జీసీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని బెదిరించింది. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఆ దేశం జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి (2001 attack) అమెరికా చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోయింది. సెప్టెంబరు 11, 2001న 4 విమానాలను అల్‌ఖైదా (Al-Qaeda) ఉగ్రవాదులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. 19 మంది ఉగ్రవాదులు నాలుగు జట్లుగా విడిపోయి ‘ట్విన్ టవర్స్’గా పిలుచుకునే ప్రపంచ వాణిజ్య సంస్థ భవంతులపై దాడులకు పాల్పడ్డారు. ఈ మారణహోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది పౌరులు క్షతగాత్రులయ్యారు. అప్పుడు అమెరికా జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇరాన్ హెచ్చరికలు చేసింది.
అమెరికా బలగాలు హర్మూజ్‌కు దూరంగా ఉంటేనే ఆ జలసంధి భద్రంగా ఉంటుందని ఇరాన్ (Iran) స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తాము చమురు అమ్మకపోతే.. ఇంకెవరూ అమ్మలేరని వ్యాఖ్యానించారు. హర్మూజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మరోసారి మొదలైన ఘర్షణలు.. 12 రోజులుగా కొనసాగుతున్నాయి. టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా దాడులు చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తాజాగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి








