ఏపీని భయపెడుతోన్న ఓమిక్రాన్.. వైద్యులు ఏం అంటున్నారు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా కోవిడ్-19(Covid) కేసులు వెలుగుచూస్తుండటం ప్రజల్లో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. జూన్ 26న కడప జిల్లాలో ఈ ఏడాది మొదటి కరోనా కేసు నమోదు కాగా, జూలై మూడవ వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 34కు పెరిగింది. కొత్తగా ఏలూరు, గుంటూరులతో(Guntur) పాటు ఉమ్మడి గోదావరి, బాపట్ల, విశాఖపట్నం, ఎన్టీఆర్(NTR) జిల్లాలలో కూడా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే ఈ తాజా కేసుల నమోదుపై ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్పందిస్తూ.. ఇవి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన “క్లస్టర్ అవుట్బ్రేక్” (సమూహ వ్యాప్తి) కాదని, వివిధ జిల్లాల్లో విడివిడిగా నమోదవుతున్న సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లని స్పష్టం చేశారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తత అవసరమని సూచించారు. ప్రస్తుతం ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్ అన్నీ గతంలో వచ్చిన ఓమిక్రాన్ రూపాంతరాలేనని నేషనల్ ఐఎంఏ కోవిడ్ టాస్క్ ఫోర్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఒరిజినల్ వేరియంట్ నుండి రూపాంతరం చెందిన ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5, ఎన్ బీ.1.8.1, మరియు ‘సికాడా ‘ (బీఏ.3.2) వంటి సబ్-వేరియంట్లు చలామణిలో ఉన్నట్లు వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇవి చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. అంత ప్రాణాంతకమైనవి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
అయినప్పటికీ, అసలు ఏ వేరియంట్ వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయో అధికారికంగా గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం రోగుల నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కొరకు పుణెలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (NIV) కి పంపించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో నలుగురు రోగులు మరణించడం కొంత ఆందోళన కలిగించినప్పటికీ, వైద్య శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. మరణించిన నలుగురు రోగులకూ (కడపకు చెందిన ముగ్గురు, కాకినాడకు చెందిన ఒకరు) ఇప్పటికే తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు.
బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు మరియు గుండె జబ్బులు ఉన్నవారికే వైరస్ ప్రభావం తీవ్రంగా మారుతోందని ఐఎంఏ నిపుణుడు రాజీవ్ జయదేవన్ హెచ్చరించారు. బాధితుల్లో ఎక్కువమంది హోం ఐసోలేషన్ లోనే కోలుకుంటుండగా, కొద్దిమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సాధారణ జ్వరం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు రద్దీ ప్రదేశాలలో మాస్కులు ధరించడం ఉత్తమమని నిపుణులు అడ్వైజరీ జారీ చేశారు.








