ఆటా మహా సభలకు అంతా సిద్ధం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కి బాల్టిమోర్ నగరం ముస్తాబవుతోంది. అమెరికా నలుమÖలల నుంచి వేలాదిమంది ఎన్నారైలు, వివిధ రంగాల ప్రముఖులు, ఇండియా నుంచి రాజకీయ నాయకులు, సినీకళాకారులు, సాహితీవేత్తలు పాలుపంచుకోనున్న ఈ మహా సభలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించటానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా తెలిపారు. దాదాపు 70 కమిటీలు ఈ మహాసభలకోసం గత కొన్ని నెలులుగా శ్రమిస్తూ వస్తున్నాయి. వందలాదిమంది వాలంటర్లు స్వచ్చందంగా రేయింబవళ్లు కష్టపడి ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్న ఈ మహాసభలు చిరస్థాయిగా నిలిచిపోనున్నాయని ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద పీటÁ వేస్తూ, విద్య వైద్య, అలుమ్ని, బిజినెస్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభలకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, మంత్రులను, ఇతర పార్టీల నాయకులను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఇతర కాన్ఫరెన్స్ నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు తమ తరపున మంత్రులను పంపించనున్నట్లు చెప్పారని జయంత్ చల్లా తెలిపారు.
ఈసారి మహాసభలలో సంగీత విభావరిని, బిజినెస్ సదస్సులను, సాహిత్య కార్యక్రమాలతోపాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అత్యంత ప్రత్యేక ఆకర్షణగా జూలై 31 (శుక్రవారం) బాల్టిమోర్ హార్బర్లో భారీ క్రూజ్ పార్టీని నిర్వహించనున్నారు. 16 నుండి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు ఈ క్రూజ్ పార్టీలో పాల్గొనవచ్చు. సుమారు 4 గంటల పాటు సాగే ఈ నౌకాయానంలో అల్లాడించే డీజే సంగీతం, డ్యాన్స్, యువతకు నచ్చే సమకాలీన వాతావరణం ఉంటాయి. ఈ ఈవెంట్ కోసం 250 మందికి పైగా యువత హాజరవుతారని నిర్వాహకులు భావిస్తున్నారు. రద్దీని బట్టి ఒకటి లేదా రెండు బోట్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. క్రూజ్ కంపెనీ ఇచ్చే సాధారణ ఆహారం కాకుండా, కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ చైర్ పర్యవేక్షణలో స్థానిక భారతీయ రెస్టారెంట్ల నుండి ప్రత్యేకంగా తెప్పించిన అథెంటిక్ ఇండియన్ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రూజ్ పార్టీలో యువతతో కలిసి సందడి చేయడానికి ఒకటి లేదా ఇద్దరు ప్రముఖ సినిమా సెలబ్రిటీలు మరియు క్రీడాకారులు కూడా హాజరుకానున్నారని వారు చెప్పారు.
శనివారం ఉదయం వైద్యులు, న్యాయవాదులు, క్రీడా రంగ నిపుణులు మరియు అమెరికాలోనే పుట్టి పెరిగిన విజయవంతమైన తెలుగు ప్రతినిధులతో ప్రత్యేక ప్యానెల్ చర్చలు ఉంటాయి. ఇది యువతకు నెట్వర్కింగ్ మరియు కెరీర్ గైడెన్స్‌కు ఎంతో ఉపయోగపడనుంది. శనివారం సాయంత్రం హోటల్ లోపల యువత కోసం భారీ బ్యాంక్వెట్ డిన్నర్, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కచేరీ ఉంటాయి. ఈ వేదికపై ప్రముఖ పాప్ సింగర్స్ మరియు ట్రెండింగ్ సెలబ్రిటీలు పర్ఫామ్ చేయనున్నారు. శుక్రవారం జరిగే క్రూజ్ పార్టీ టికెట్ ధర 60 డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఆటా మెయిన్ కాన్ఫరెన్స్ టికెట్ తీసుకున్న వారికి శనివారం నాటి ప్యానెల్ డిస్కషన్లు మరియు యూత్ బ్యాంక్వెట్ ఈవెంట్లు పూర్తిగా ఉచితమని వారు పేర్కొన్నారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల (కాలిఫోర్నియా, న్యూయార్క్, నార్త్ కరోలినా తదితర) నుండి వచ్చే తెలుగు యువత ఒకరినొకరు కలుసుకోవడానికి, కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడానికి మరియు తెలుగు సంస్కృతిని కాపాడుకోవడా నికి ఆటా యూత్ కాన్ఫరెన్స్ ఒక అద్భుతమైన వేదిక అని, ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేయాలని యూత్ కమిటీ సభ్యులు కోరారు.
ఈ మహాసభలకోసం వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేశారు. మహాసభల నిర్వహణకు ముందుగా ప్రధాన నగరాల్లో ప్రత్యేక పోటీలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో “ఝుమ్మంది నాదం” (గాన పోటీలు) మరియు “సయ్యంది పాదం” (నృత్య పోటీలు) జరిగాయి. అలాగే అందాల పోటీలను కూడా నిర్వహించారు. వర్జీనియా, చికాగో, డెలావేర్ వ్యాలీ, న్యూజెర్సీ, ఆర్లాండో, ఆస్టిన్, ఫీనిక్స్, అట్లాంటా, డల్లాస్, రాలీతో పాటు అమెరికాలోని అనేక ప్రధాన నగరాలలో నిర్వహించిన ఈ పోటీలలో ప్రతి నగరంలో సగటున 150 నుండి 200 మంది వరకు పాల్గొన్నారు. సంగీతం, క్లాసికల్, మోడరన్ నృత్యాలు, జానపద కళలు వంటి వివిధ విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు పలువురిని ఆహ్వానించారు. తెలుగు సంగీతం, సాహిత్యం, నృత్య సంప్రదాయాలు, కళా వైభవం మరియు మన సంస్కృతి గొప్పతనాన్ని యువతకు పరిచయం చేసే సాంస్కృతిక విద్యాలయాలు. అమెరికా వంటి బహుళ సంస్కృతులు, భాషలు, జాతులు కలిసి జీవిస్తున్న సమాజంలో పెరుగుతున్న తెలుగు పిల్లలకు తమ మూలాలను గుర్తు చేస్తూ, తమ సంస్కృతిపై గౌరవాన్ని పెంపొందించే విలువైన వేదికలుగా ఇవి నిలుస్తున్నాయి. వివిధ నగరాల్లో జరిగిన పోటీల విజేతలకు ఫైనల్ పోటీలను మహాసభల వేదికపై నిర్వహిస్తున్నారు.
తెలుగు భాష, సంస్కృతి, కళలు కేవలం వినోదానికి సంబంధించిన అంశాలు కావు, అవి మన చరిత్రకు, మన సంప్రదాయాలకు, మన కుటుంబ విలువలకు, మన అస్థిత్వానికి ప్రతీకలు. విదేశాల్లో జన్మించి పెరుగుతున్న రెండవ, మూడవ తరం యువతకు తమ మూలాలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాన్ఫరెన్స్‌లో సినీ తారల సందడితో పాటు సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్, అలాగే యువతను ఆకట్టుకునే ప్రముఖ ‘నిరవల’ లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
అలాగే యువతలోని ప్రతిభను వెలికితీయడానికి సరికొత్త వేదికను సిద్ధం చేసింది. ఈ వేడుకల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్, రీల్స్, ఫోటోగ్రఫీ విభాగాల్లో భారీ పోటీలను ఏర్పాటు చేశాము. తమలోని కళాత్మక ఆలోచనలకు దృశ్య రూపం ఇచ్చే వర్ధమాన కళాకారులకు ఇదొక సువర్ణావకాశం. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి టాలీవుడ్ ప్రముఖ సినీ సెలబ్రిటీల చేతుల మీదుగా పురస్కారాలను అందజే వెండితెర దిగ్గజాల సమక్షంలో ప్రతిభను చాటుకోవడమే కాకుండా, వారి నుండే ప్రశంసలు పొందే వీలుండటంతో క్రియేటివ్ మైండ్స్ ఈ పోటీలపై ఆసక్తిని చూపుతోంది.
విదేశాల్లో జన్మించి పెరుగుతున్న రెండవ, మూడవ తరం యువతకు తమ మూలాలను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తమ సంస్కృతిని అర్థం చేసుకున్న యువత ఇతర సంస్కృతులను కూడా మరింత గౌరవించే విశాల దృక్పథాన్ని అలవరుచుకునేందుకు వీలుగా సాహిత్య కార్యక్రమాలు కనిపించనున్నాయి.
ఈ మహాసభల్లో పాల్గొనేందుకు సినీరంగానికి చెందిన పలువురు కళాకారులు వస్తున్నారు. హీరో, హీరోయిన్లతోపాటు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు వస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్దే, రితూవర్మ, శ్రీముఖి, అనన్యనాగళ్ళ, దివి వద్స్య, దిల్ రాజు, అడివిశేష్, నితిన్, సందీప్ రెడ్డి వంగ, రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు.
బాల్టిమోర్ కన్వెన్షన్‌లో బిజినెస్ సెమినర్స్ కూడా అలరించనున్నాయి. బిజినెస్ దిగ్గజాలు, ఇన్వెస్టర్స్, స్టార్టుప్ ఫౌండర్స్ మరియు ఔత్సాహికుల సమక్షంలో బి 2బి మ్యాచ్ మేకింగ్, ఎగ్జిక్యూటివ్ నెట్వర్కింగ్ సెషన్స్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ఫోరమ్స్ మరియు జీ టీవీ 5 సహకారంతో ఐడియా బాజ్ మొదలగు వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. తమ సృజనాత్మకకు, బిజినెస్ రంగంలో అభివృద్ధి చెందాలనుకొనేవారందరికి వారికి ఇది మహా అవకాశం.
మెడికల్ రంగంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రభావం, హృద్రోగ , డయాబెటిస్, కాన్సర్ రీసెర్చ్ రంగాలలో ఏ విధమైన ప్రభావం చూపించబోతుంది తదితర విషయాలు సి ఎం ఈ కాన్ఫరెన్స్ లో చర్చించనున్నారు. ఈ వైద్య సదస్సుకు ప్రైమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు, చైర్మన్ అండ్ సీఈఓ డా. ప్రేమ్ రెడ్డి గౌరవ అతిథిగా విచ్చేయనున్నారు. అలాగే ఆటా హెల్త్ కమిటీ చైర్మన్ డా. సుజీత్ పున్నం (ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ) డా. గురునాథ్ రెడ్డి, డా. సురేష్ రెడ్డి, డా. వేణుమాధవ్ రెడ్డి కోట్ల, డా. సతీష్ కతులా, డా. కిషోర్ బెల్లంకొండ, డా. రమ్య మొసార్ల, డా. మహాదేవప్ప హునసికట్టి, శ్రీనాగేష్ పాలువోయి, డా. సుమన్ మంచిరెడ్డి, డా. ఎమ్. ఎస్. రెడ్డి (నోబెల్ ప్రైజ్ నామినీ), డా. అరుల్ విగ్గీ (నెఫ్రాలజీ), డా. మెహర్ మేదవరం తదితరులు ఇందులో పాల్గొంటున్నారు.
అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక సాహిత్య పోటీల నిర్వహణకు పూనుకుంది. అమ్మ భాష అభరణాలైన అక్షరాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కవులు, రచయితల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహించింది. సాహిత్యాభిమానులను అలరించేలా అంతర్జాతీయ అమెరికా జాతీయ స్థాయిలో రెండు వేర్వేరు విభాగాలుగా ఈ పోటీలు సాగింది. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు రచయితలైనా పాల్గొనేందుకు వీలుగా నవలల పోటీలను నిర్వహించింది.
విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే పలు సాహిత్య ప్రక్రియలకు ఈ మహాసభల్లో రూపకల్పన చేశారు. ప్రత్యేక ఆకర్షణగా డా॥ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ‘అష్టావధానం’ ఈ సాహిత్య ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా అవధాని శేఖర, బ్రహ్మశ్రీ, శతావధాని డా॥ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ చేత అష్టావధానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రముఖ వాగ్గేయకారుడు, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ అవధాన కవి డా॥ నరాల రామిరెడ్డి, జయదేవ్ మెట్టుపల్లి తదితరులు హాజరవుతున్నారు.
వైద్య సదస్సుకు ప్రైమ్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు, చైర్మన్ అండ్ సీఈఓ డా. ప్రేమ్ రెడ్డి గారు గౌరవ అతిథిగా విచ్చేయనున్నారు. అలాగే ఆటా హెల్త్ కమిటీ చైర్మన్ డా. సుజీత్ పున్నం (ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ) డా. గురునాథ్ రెడ్డి, డా. సురేష్ రెడ్డి, డా. వేణుమాధవ్ రెడ్డి కోట్ల, డా. సతీష్ కతులా, డా. కిషోర్ బెల్లంకొండ, డా. రమ్య మొసార్ల, డా. మహాదేవప్ప హునసికట్టి, శ్రీనాగేష్ పాలువోయి, డా. సుమన్ మంచిరెడ్డి, డా. ఎమ్. ఎస్. రెడ్డి (నోబెల్ ప్రైజ్ నామినీ), డా. అరుల్ విగ్గీ (నెఫ్రాలజీ), డా. మెహర్ మేదవరం తదితరులు ఇందులో పాల్గొంటున్నారు.
ఈ మహాసభల్లో శ్రీ శివ పార్వతుల కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫాషన్ షో, ఆటా బ్యూటీ పేజియంట్, యూత్ ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
అమెరికాలో పుట్టి పెరుగుతున్న యువతీ, యువకులు మరియు అమెరికాకు ఉన్నత చదువులు చదవడానికి, అలాగే ఉద్యోగాల కోసం వచ్చిన వారికి ఆటా వివాహ పరిచయ వేదిక సహాయం చేస్తుంది.
ఒక మినీ మాల్ని తలపించనున్న విధంగా వివిధ వెండర్ బూత్స్ ఏర్పాటు చేసారు. జ్యువలరీ మొదలుకొని రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్, అవగాహన సదస్సులని ఏర్పాటు చేసారు. కుటుంబ సమేతంగా అందరికి ఒక మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానున్నది.
ఆటా మహాసభలకు వస్తున్నవారికి మంచి ఆతిధ్యాన్ని అందివ్వడానికి కూడా ఆటా నాయకులు ఏర్పాట్లు చేశారు. అలాగే వెన్యూకు సమీపంలోనే వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు రావాల్సిందిగా ఆటా నాయకులుకోరారు.








