సనాతన ధర్మంపై శ్రీమతి అయ్యగారి శ్రీదేవి ఆధ్యాత్మిక ప్రసంగం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే 19వ అటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ వేడుకలకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమవుతోంది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలలో భాగంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
‘సనాతన ధర్మం – ఆధునిక జీవనానికి శాశ్వత జ్ఞానం’
ఈ వేడుకలలో భాగంగా కంచి కామకోటి పీఠం ఆస్థాన విదుషీ, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు కథా గాన విశ్లేషకులు సౌభాగ్యవతి అయ్యగారి శ్రీదేవి గారు సనాతన ధర్మంపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నారు. “సనాతన ధర్మం – ఆధునిక జీవనానికి శాశ్వత జ్ఞానం” అనే అంశంపై జగద్గురు ఆది శంకరాచార్యుల దివ్య బోధనల స్ఫూర్తితో, మానసిక ప్రశాంతత, జీవన పరమార్థం మరియు సామరస్యం పెంపొందించే విధంగా ప్రసంగం సాగనుంది.
ఈ కార్యక్రమంలో భక్తులను అలరించేందుకు పలు భక్తి శీర్షికలపై కథా గానం నిర్వహించనున్నారు:
ఆది శంకరాచార్య వైభవం, భజ గోవిందం, శ్రీ కామాక్షి వైభవం, పరమేశ్వరి వైభవం, సీతా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, పద్మావతి కళ్యాణం, పార్వతీ కళ్యాణం, గోవింద పట్టాభిషేకం, వెంకటాచల వైభవం, వాసవీ కన్యక వృత్తాంతం
కార్యక్రమ ముఖ్యాంశాలు:
సనాతన ధర్మంపై ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రసంగం, దైనందిన జీవితంలో ఆది శంకరాచార్యుల బోధనల ఆచరణ, ప్రేక్షకులతో ముఖాముఖి మరియు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.
కర్ణాటక సంగీతం, నామ సంకీర్తనం, భజనలు, స్తోత్రాలు మరియు ఆధ్యాత్మిక వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తారు. భక్తి, జ్ఞానం, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక వికాసంతో కూడిన ఈ అద్భుతమైన సెషన్లో ప్రవాస తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ‘అటా’ ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ కమలాకర్ నైలాల మరియు కోర్ కమిటీ ప్రతినిధులు కోరారు.








