ఒకప్పుడు డిజాస్టర్… ఇప్పుడు ప్రపంచం ‘మాస్టర్‌పీస్’ అంటోంది! ఈ సినిమా కథే వేరు
–సూర్య ప్రకాష్ జోశ్యుల
“ఫ్లాప్!”
ఓ సినిమాకు ప్రపంచం ఐదేళ్ల క్రితం ఇచ్చిన తీర్పు.
“మాస్టర్‌పీస్!”
అదే ప్రపంచం ఇప్పుడు అదే సినిమాకి ఇస్తున్న తీర్పు.
మారింది సినిమా కాదు… మారింది ప్రేక్షకులు సినిమాని చూస్తున్న చూపు.
రూ.850 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా కుప్పకూలిన ఒక హాలీవుడ్ చిత్రం… ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. అదే రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన ‘ది లాస్ట్ డ్యూయల్’ (The Last Duel).
ఓటీటీలో ఏదైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు—”అరెరే! ఇంత గొప్ప సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యాం?” అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా! సరిగ్గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులంతా ఇదే అనుభూతిని పొందుతున్నారు. బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఒక సినిమా అసలైన స్థాయిని నిర్ణయించలేవనడానికి ఈ చిత్రమే ప్రత్యక్ష నిదర్శనం.
ఆ రోజు ఎందుకు తిరస్కరించారు?
2021 అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు భారీ నష్టాలను మూటగట్టుకుంది. $100 మిలియన్ల(₹965 కోట్లు) బడ్జెట్‌కు గానూ ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కేవలం $30 మిలియన్లు (₹289.5 కోట్లు) మాత్రమే! అప్పట్లో ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోకపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి:
కరోనా భయాలు & డిజిటల్ అలవాటు:
సెకండ్ వేవ్ ముగిసిన వెంటనే థియేటర్లు తెరిచినా, జనం రావడానికి భయపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ (Adult Audience) థియేటర్ల కంటే ఇంట్లోనే ఉండటానికి మొగ్గు చూపారు.
ప్రచారం లోపించడం & కంటెంట్:
ఈ సినిమా దౌర్జన్యం, ఆధిపత్యం, చట్టపరమైన పోరాటం చుట్టూ తిరిగే సీరియస్ డ్రామా. ‘రాషోమోన్’ తరహాలో ఒకే కథను ముగ్గురి కోణాల్లో చూపించే మెల్లిగా నడిచే కథనం (Slow Burn Narrative) ఆ టైమ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
యువతను ఆకట్టుకోలేకపోవడం:
మార్వెల్ సూపర్ హీరో సినిమాలు ఏలే ఆ కాలంలో, మధ్యయుగాల నాటి సాంప్రదాయ చారిత్రక ఘట్టాన్ని చూడటానికి అప్పటి యంగ్ ఆడియన్స్ ఆసక్తి చూపలేదు.
కథ ఏమిటి? మూడు సత్యాలు… ఒక్క ప్రమాదకర ముగింపు!
14వ శతాబ్దపు ఫ్రాన్స్. రాచరికపు నీడలు, మతం పేరిట నడిచే కట్టుబాట్లు, కత్తి దూస్తే కానీ రాలని న్యాయం… ఇదీ నాటి సమాజం. ఈ వాతావరణంలో, ప్రాణస్నేహితులుగా మొదలై కత్తికి కత్తి ఎదురయ్యే శత్రువులుగా మారిన ఇద్దరు యోధుల కథే ‘ది లాస్ట్ డ్యూయల్’.
ఈ సినిమా సాధారణ కథలా ఒకే కోణంలో సాగదు. ఒకే సంఘటన చుట్టూ అల్లుకున్న మూడు వేర్వేరు దృక్కోణాల (Rashomon Style) ఆధారంగా నడుస్తుంది. ఆ ముగ్గురి ఆలోచనలు, ఆ ముగ్గురి సత్యాలు ఏమిటంటే:
1. జీన్ డి కార్రూజెస్ (మ్యాట్ డామన్): “నా గౌరవమే నా ప్రాణం”
జీన్ ఒక మొరటు, వీరత్వమే తప్ప నయవంచన తెలియని సైనికుడు. యుద్ధరంగంలో దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. కానీ రాజసభలలో, రాజకీయాల్లో అందరిలా ముఖస్తుతి చేయడం అతనికి రాదు. దానివల్ల రావాల్సిన ఆస్తులు, పదవులు రాకుండాపోతాయి. తన భార్య మార్గరెట్పై తన మాజీ మిత్రుడు జాక్స్ లీ గ్రిస్ దాడి చేశాడని తెలిసినప్పుడు, అతని రక్తం మరుగుతుంది. నాటి ఫ్రాన్స్ చట్టాల ప్రకారం… తన భార్య మానాన్ని, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి రాజు ముందు నిలబడి “ద్వంద్వ యుద్ధానికి (Duel)” సవాలు విసురుతాడు. అతనికి యుద్ధం గెలవడమే ‘న్యాయం’.
2. జాక్స్ లీ గ్రిస్ (ఆడమ్ డ్రైవర్): “నేను ఏ తప్పూ చేయలేదు”
జాక్స్ అందగాడు, చతురుడు, పైగా ప్రభువు పీటర్ (బెన్ అఫ్లెక్) కి అత్యంత సన్నిహితుడు. సభల్లో ఎలా నడుచుకోవాలో, అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. అందుకే జీన్‌కు దక్కాల్సిన పదవులు, భూములు జాక్స్‌కు దక్కుతాయి. దాంతో వారి మధ్య పగ పెరుగుతుంది. మార్గరెట్‌ను చూసి మోహపడిన జాక్స్, ఆమెను బంధించి దారుణానికి ఒడిగడతాడు. కానీ, అతడి కోణంలో… అది బలాత్కారం కాదు! ఆమె కూడా తనను ఇష్టపడిందని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని తనను తాను సమర్థించుకుంటాడు.
3. మార్గరెట్ (జోడీ కోమర్): “ఇది నా సత్యం… నేనే బాధితురాలిని!”
ఈ కథలో అత్యంత కీలకమైన, ఎమోషనల్ కోణం మార్గరెట్ది. ఒకవైపు భర్త జీన్ ఆమెను ఒక ఆస్తిలా, తన గౌరవానికి చిహ్నంగా మాత్రమే చూస్తాడు. ఇంకోవైపు జాక్స్ ఆమె ఆత్మగౌరవాన్ని బలితీసుకుంటాడు. నాటి కాలంలో ఒక మహిళ తనపై జరిగిన దారుణాన్ని బయటకు చెబితే, సమాజం ఆమెనే నిందిస్తుంది. తెలిసినా, ప్రాణాలకు తెగించి ఆమె నోరు విప్పుతుంది. “నిజం చెప్పినందుకు నేను ప్రాణాలు కోల్పోయినా సరే… నేను అనుభవించిన నరకం నిజం” అని గొంతెత్తుతుంది.
క్లైమాక్స్ : ఒకరి ప్రాణం… ఇంకొకరి మానం!
ఇక్కడో అదిరిపోయే ట్విస్ట్ ఉంది! నాటి ఫ్రాన్స్ చట్టాల ప్రకారం—ఈ ద్వంద్వ యుద్ధంలో (Duel) ఎవరు గెలిస్తే వారి వైపే దేవుడు ఉన్నాడని, వారిదే ‘నిజం’ అని నమ్మేవారు.
ఒకవేళ భర్త జీన్ గెలిస్తే… మార్గరెట్ చెప్పింది నిజమని నిరూపించబడి ఆమె ప్రాణాలతో మిగులుతుంది.
ఒకవేళ జీన్ ఓడిపోయి చనిపోతే… మార్గరెట్ చెప్పింది “అబద్ధం” అని తీర్పునిచ్చి, నాటి మూఢాచారాల ప్రకారం ఆమెను సజీవంగా దహనం (Burnt at the stake) చేస్తారు!
తన భర్త చేసే ఆ రక్తం చిందే పోరాటాన్ని, ఒకవైపు సజీవ దహనానికి సిద్ధం చేసిన గొలుసులకు బంధించబడి మార్గరెట్ చూడాల్సి వస్తుంది. చివరి 30 నిమిషాల పాటు సాగే ఆ గుర్రాలు, కత్తులు, రక్తపాతంతో కూడిన వీరపోరాటం ప్రేక్షకుడిని శ్వాస తీసుకోనివ్వదు.
ఇప్పుడు ఎందుకు జనం చూస్తున్నారు?
అప్పట్లో థియేటర్లలో తిరస్కరించిన జనం ఇప్పుడు ఓటీటీల్లో దీన్ని నెత్తిన పెట్టుకోవడానికి రెండు అత్యంత కీలకమైన కారణాలు ఉన్నాయి:
క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ తెచ్చిన పీరియడ్ వేవ్!
క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘ది ఒడిస్సీ’ (The Odyssey) ఇటీవల విడుదలవుతూనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు మహాకావ్యం ఆధారంగా నోలన్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకాభిరుచిని ఒక్కసారిగా మార్చేసింది. బిగ్-స్కేల్ పీరియడ్, హిస్టారికల్ మరియు మైథలాజికల్ చిత్రాలపై జనం ఆసక్తిని ఈ సినిమా విపరీతంగా పెంచేసింది. దాంతో ఆడియన్స్ ఓటీటీల్లో కూడా అలాంటి ఎపిక్ హిస్టారికల్ డ్రామాల కోసం వెతకడం మొదలుపెట్టారు.
‘ది ఒడిస్సీ’ హీరో మ్యాట్ డామన్ మ్యాజిక్!
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే… నోలన్ ‘ది ఒడిస్సీ’ చిత్రంలో టైటిల్ రోల్ (ఒడిస్సస్) పోషించి మెప్పించింది మరేవరో కాదు, మ్యాట్ డామన్! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మ్యాట్ డామన్ పేరు మారుమోగిపోతోంది. ఆయన నటించిన ‘ది ఒడిస్సీ’ చూసి థ్రిల్ అయిన ప్రేక్షకులు, మ్యాట్ డామన్ గతంలో చేసిన పీరియడ్ / వార్ సినిమాలేంటి అని శోధించడం మొదలుపెట్టారు. అలా రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో ఆయన కత్తి పట్టి పోరాడిన ‘ది లాస్ట్ డ్యూయల్’ ఓటీటీలో జనాల కంటికి కనిపించింది. నోలన్ తెచ్చిన క్రేజ్, ఒడిస్సీ హీరో మ్యాట్ డామన్ ఇమేజ్… రెండూ కలిసి ‘ది లాస్ట్ డ్యూయల్’ మూవీకి ఓటీటీలో ఊహించని మైలేజ్ తెచ్చిపెట్టాయి.
బాక్సాఫీస్ వద్ద ఓడి… చరిత్రలో గెలిచిన మరికొన్ని సినిమాలు!
కాలం గడిచాక మాస్టర్‌పీస్‌లుగా మారిన సినిమాలు ‘ది లాస్ట్ డ్యూయల్’ ఒక్కటే కాదు. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి:
• ది షాషాంక్ రిడెంప్షన్ (The Shawshank Redemption): 1994లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ రోజు ఐఎమ్‌డిబి (IMDb) లో ప్రపంచంలోనే నంబర్-1 సినిమాగా నిలిచింది.
• బ్లేడ్ రన్నర్ (Blade Runner): ఇది కూడా రిడ్లీ స్కాట్ తీసిందే! 1982లో విడుదలైనప్పుడు డిజాస్టర్. కానీ కాలక్రమేణా సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా మారింది.
• ఫైట్ క్లబ్ (Fight Club): 1999లో బాక్సాఫీస్ బొమ్మ తలకిందులైంది. తర్వాత డివిడిలు, బుల్లితెరపై సంచలనం సృష్టించి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.
• టెనెట్ (Tenet): నోలన్ తీసిన ఈ మైండ్-బెండింగ్ థ్రిల్లర్ పాండెమిక్ వల్ల థియేటర్లలో సరిగ్గా ఆడలేదు కానీ, తర్వాత ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన ఆదరణ పొందింది.
చివరగా…
ప్రతి సినిమాకీ ఒక విడుదల తేదీ ఉంటుంది. కానీ ప్రతి గొప్ప సినిమాకీ ఒక “టైమ్” కూడా ఉంటుంది. ‘ది లాస్ట్ డ్యూయల్’కు ఆ టైమ్ ఐదేళ్ల తర్వాత వచ్చింది. అంతే.
ఎక్కడ చూడచ్చు
Paramount+ లో స్ట్రీమింగ్ అవుతోంది








