USలో చదువుకునే స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్: సెప్టెంబర్ 15లోపే అమెరికాకు తిరిగి వెళ్లండి!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు పలు ప్రముఖ యూనివర్సిటీలు కీలక సూచనలు జారీ చేశాయి. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ కోసం ఇండియాకు వచ్చిన విద్యార్థులు సెప్టెంబర్ 15కు ముందే అమెరికాకు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నాయి. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అమల్లోకి తీసుకురానుండటమే దీనికి కారణం.
సెప్టెంబర్ 15 నుంచి అమెరికాలో F-1, J-1 వీసాలపై ప్రవేశించే విద్యార్థులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S)’ విధానం స్థానంలో ‘ఫిక్స్డ్ టైమ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్’ విధానం అమల్లోకి రానుంది.
ఏం మారబోతోంది?
ఇప్పటి వరకు విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇకపై అమెరికాలో ఉండేందుకు ముందే ఒక నిర్దిష్ట గడువును నిర్ణయిస్తారు. ‘ఆథరైజ్డ్ అడ్మిషన్ అన్టిల్ డేట్ (AUD)’ పేరుతో ఇచ్చే ఆ తేదీ వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది.
సాధారణంగా కోర్సు వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఒకవేళ కోర్సు పూర్తి కావడానికి అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే, గడువు ముగిసేలోపు స్టే ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
యూనివర్సిటీలు ఎందుకు హెచ్చరిస్తున్నాయి?
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే ముందు అమెరికాకు చేరుకోవడం మంచిదని పలు యూనివర్సిటీలు తమ విద్యార్థులకు సూచిస్తున్నాయి. కొలంబియా యూనివర్సిటీ అయితే సెప్టెంబర్ 8న తరగతులు ప్రారంభమవుతున్నందున, ఆ తేదీలోపే న్యూయార్క్‌కు చేరుకోవాలని స్పష్టం చేసింది. కొత్త విధానం అమలులోకి వచ్చే తొలి రోజుల్లో ఏర్పడే పరిపాలనా మార్పులు, ప్రక్రియల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపింది.
కొలంబియాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, కార్నెగీ మెలన్ యూనివర్సిటీలు కూడా తమ అంతర్జాతీయ విద్యార్థులకు అధికారిక సూచనలు జారీ చేశాయి. తాజా ఇమ్మిగ్రేషన్ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని విద్యార్థులను కోరుతున్నాయి.
విద్యార్థులు ఏం చేయాలి?
సెప్టెంబర్ 15 గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఇండియాలో ఉన్న విద్యార్థులు తమ ప్రయాణ ప్రణాళికలను ఆలస్యం చేయకుండా చూసుకోవాలని యూనివర్సిటీలు సూచిస్తున్నాయి. అలాగే యూనివర్సిటీల నుంచి వచ్చే ఈమెయిల్స్, అధికారిక అప్డేట్స్ను క్రమం తప్పకుండా పరిశీలించాలని కూడా స్పష్టం చేస్తున్నాయి.








