నీట్ లీకేజీ సెగ.. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ ఆసరా!
దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కుదిపేస్తున్న ‘నీట్’ పేపర్ లీకేజీ ఉదంతం ప్రస్తుతం రాజకీయ రణరంగంగా మారింది. ప్రతిష్టాత్మక పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ దాకా విద్యార్థులు, యువత తీవ్ర ఆందోళనలు చేస్తుంటే.. ఆ నిరసనలకు మద్దతుగా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఒకేసారి బోనులో నిలబెట్టే వ్యూహంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద భారీ నిరసన దీక్ష చేపట్టి విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా పార్టీలకు అతీతంగా యువత, విద్యార్థులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులైన యువతపై నమోదైన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్రంలో మోదీ సర్కార్ తీరుపై కేటీఆర్ సెటైర్లు వేశారు. “ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. తీరా ‘మేక్ ఇన్ ఇండియా’ అడిగితే ‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చారు” అని ధ్వజమెత్తారు. ప్రస్తుత నవతరం చావుకైనా, ఈడీ, ఐటీ సోదాలకైనా భయపడేది కాదని.. ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో ఆ యువతరంతోనే పెట్టుకున్నారని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా కేటీఆర్ పదునైన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీపై తాము పోరాడుతుంటే ‘చోటా భాయ్’ రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం వస్తోందో అర్థం కావడం లేదన్నారు. పాత కేసులు తోడుతారనే భయంతోనే సీఎం మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ ధర్నా చేసినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. నీట్ పేపర్ లీక్‌పై సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశంలో ఏం జరిగినా కేసీఆర్, కేటీఆర్‌దే తప్పంటూ నిందించే యూత్ కాంగ్రెస్ నాయకుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ రోడ్డెక్కి విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ తరుణంలో.. తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తినట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు చెక్ పెడుతూ, విద్యార్థుల హక్కుల సాధన కోసం కేటీఆర్ నేరుగా కదనరంగంలోకి దిగారు. నీట్ విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవైపు కేంద్రంలోని బీజేపీని, మరోవైపు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ను కలుపుకొని దాడి చేసే వ్యూహంతో బీఆర్ఎస్ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తోంది.








