ఇన్ఫోసిస్ సీఈవోగా ఆశిష్ కుమార్ దాస్..!
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లో కీలక నాయకత్వ మార్పు జరిగింది. కంపెనీ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ స్థానంలో ఆయన 2027 ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారు.
నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఆశిష్ దాస్ తక్షణమే సీఈవో డెజిగ్నేట్గా బాధ్యతలు చేపట్టి, నాయకత్వ మార్పు ప్రక్రియలో భాగస్వాములవుతారు. ఈ నియామకానికి వాటాదారుల మరియు చట్టపరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది.
ఇన్ఫోసిస్లో దాదాపు మూడు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆశిష్, సంస్థ చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరివర్తన ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నియామకంపై ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ, కంపెనీ విలువలను కాపాడుతూనే, సమకాలీన అవసరాలకు అనుగుణంగా సాహసోపేతమైన మార్పులు తీసుకురాగల సమర్థవంతమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. బోర్డు తనపై ఉంచిన నమ్మకానికి ఆశిష్ దాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ ఈ పరిణామాన్ని స్వాగతించారు. నాయకత్వ బదిలీ ప్రక్రియ అత్యంత సజావుగా సాగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో అర్హులైన నూతన ఉద్యోగులకు 9,836 రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లను (ఆర్ఎస్యూలు), ఇతర ఉద్యోగులకు సుమారు 4.78 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది.








