భారతీయ బ్రాండ్ల మొబైల్ ఫోన్లను ప్రోత్సహించాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాల్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, మొబైల్ ఫోన్ల తయారీ, ఎరువుల ఉత్పత్తి, రైల్వే విస్తరణ వంటి రంగాలకు చెందిన ఏడు ప్రధాన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ల కొనుగోలులో మన దేశం రెండో స్థానంలో నిలిచింది. అయితే.. ఇప్పటికీ ఇతర దేశాల బ్రాండ్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం. దేశంలో వాడుతున్న ఫోన్లలో 99 శాతం దేశీయంగానే ఉత్పత్తి చేస్తున్నప్పటికీ.. వీటిలో భారత్‌కు సొంతమైన మొబైల్ బ్రాండ్లు చాలా తక్కువ. దీంతో భారతీయ బ్రాండ్లను ప్రోత్సహించటంతో పాటు మొబైల్ ఫోన్ల ఎగుమతిలో ప్రపంచ నంబర్ వన్‌గా ఎదగాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.62,500 కోట్లతో ఎంపీఎంఎస్ పథకాన్ని ప్రారంభించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పథకం పూర్తయ్యే నాటికి దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకంలో భాగంగా కొన్ని మొబైల్ ఫోన్ల అమ్మకాలపై 2.25 శాతం నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. దేశీయంగా మొబైల్ విడిభాగాల ఉత్పత్తికి 1.5 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తారు. మొబైల్ ఫోన్ల డిజైన్, రిసెర్చ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలకు 3ు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఎంపీఎంఎస్ ద్వారా రూ.15 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతోపాటు దేశీయంగా మొబైల్ ఫోన్ల పరిశ్రమలో కొత్తగా 60 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని భావిస్తున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
సెమీ కండక్టర్స్ మిషన్ కి కూడా కేబినెట్ ఆమోదం
భారతదేశాన్ని అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0’కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1.27 లక్షల కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోకి అదనంగా రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ల దేశీయ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సెమికాన్ 2.0 మొత్తం ఆరు ప్రధాన మూలస్తంభాలపై పనిచేస్తుందని, అందులో మొదటిది ‘చిప్ డిజైన్’ అని మంత్రి వివరించారు. ముడి ఖనిజాలు, వాయువులను సరఫరా చేసే అనుబంధ పరిశ్రమలకు కూడా ఈ విడతలో ప్రోత్సాహకాలు అందజేస్తారు.
గతంలో ప్రవేశపెట్టిన సెమికాన్ 1.0 కింద టాటా ఎలక్ట్రానిక్స్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రూ.1.64 లక్షల కోట్ల విలువైన 12 ప్రాజెక్టులను ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజా అప్‌గ్రేడ్‌తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) పరికరాల చిప్ అవసరాలను తీర్చడంలో భారత్ స్వయం సమృద్ధి సాధించనుంది.








