నార్వే కోస్టల్ హైవే ప్రాజెక్టు..!
వాణిజ్య కార్యకలాపాలకు ప్రాధాన్యతను గుర్తించి పలుదేశాలు.. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తమ మేథోశక్తితో ప్రత్యేక విధానాలు అవలంభిస్తున్నాయి. ఇందులో భాగంగా నార్వే.. ఓ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత లోతైన సముద్రగర్భ రహదారి టన్నెల్ నిర్మాణంతో చరిత్ర సృష్టించబోతోంది. ‘రోగ్ఫాస్ట్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, 27 కిలోమీటర్ల పొడవుతో సముద్ర మట్టానికి సుమారు 392 మీటర్ల (దాదాపు 1286 అడుగులు) లోతున ప్రయాణించే అద్భుతమైన రహదారి అందుబాటులోకి వస్తుంది. నార్వే పశ్చిమ తీరంలోని బోక్నాఫ్జోర్డ్ సముద్ర జలాల కింద ఈ రెండు వరుసల సొరంగాన్ని నిర్మిస్తున్నారు.
నార్వే పశ్చిమ తీర ప్రాంతం మత్స్య, చమురు, గ్యాస్, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో కీలకం. అయితే, ఈ ప్రాంతంలోని ప్రధాన నగరాలైన స్టావాంగర్, బెర్గెన్ మధ్య ప్రయాణం ప్రస్తుతం ఫెర్రీలు, చిన్నచిన్న టన్నెళ్లపై ఆధారపడి సాగుతోంది. దీనివల్ల ప్రయాణ సమయం దాదాపు ఐదు గంటల వరకు పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ‘E39 కోస్టల్ హైవే’ ప్రాజెక్టులో భాగంగా ఫెర్రీ రహిత మార్గాన్ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన రోగ్ఫాస్ట్ టన్నెల్ పూర్తయితే, కీలక మార్గాల్లో ప్రయాణ సమయం సుమారు 40 నిమిషాల వరకు తగ్గనుంది. రవాణాకు ఎలాంటి అంతరాయం ఉండదు.
ఇవి కూడా చదవండి
ఈ టన్నెల్ నిర్మాణం అత్యంత క్లిష్టమైన సవాళ్లతో కూడుకున్నది. కొన్ని దేశాల్లో మాదిరిగా ముందుగా తయారుచేసిన కాంక్రీట్ భాగాలను అమర్చకుండా, నేరుగా సముద్ర గర్భంలోని దృఢమైన రాతి పొరలను తొలిచి ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. పనులను వేగవంతం చేసేందుకు ఉత్తరం, దక్షిణం, మధ్య భాగాల నుంచి ఏకకాలంలో నిర్మాణం సాగిస్తున్నారు.
అయితే, సముద్ర మట్టానికి దాదాపు 300 మీటర్ల లోతులో పనులు సాగుతున్నప్పుడు, బలహీనమైన, పగుళ్లు ఉన్న రాతి పొరల నుంచి పెద్ద ఎత్తున సముద్రపు నీరు లీక్ అవుతోంది. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ భౌగోళిక నిర్మాణాల వల్ల పనులు నెమ్మదిస్తున్నాయి. ఇంజనీర్లు ప్రత్యేకమైన గ్రౌటింగ్, సీలింగ్ టెక్నాలజీలను ఉపయోగించి నీటి లీకులను అరికట్టి, చుట్టుపక్కల రాతి పొరలను స్థిరీకరిస్తున్నారు. నార్వేజియన్ పబ్లిక్ రోడ్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ మేనేజర్లు ఈ సమస్యలను ధృవీకరించారు. భద్రతా ప్రమాణాల ప్రకారం, టన్నెల్ పైభాగంలో కనీసం 50 మీటర్ల మందంతో దృఢమైన రాతి పొర ఉండాలి.
ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత ఉంది. సముద్ర మట్టానికి 260 మీటర్ల లోతులో ఒక భూగర్భ జంక్షన్, రౌండ్అబౌట్లను నిర్మిస్తున్నారు. ఇది సమీపంలోని క్విట్సోయ్ ద్వీపానికి కనెక్టివిటీని అందిస్తుంది. ఖర్చుల పెరుగుదల కారణంగా 2019లో తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్, 2021లో పునఃప్రారంభమైంది. దీని అంచనా వ్యయం దాదాపు 2.3 బిలియన్ యూరోలు. ప్రభుత్వ నిధులు, టోల్ రుసుములతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయనున్నారు. 2033 నాటికి ఈ టన్నెల్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు విజయం, భవిష్యత్తులో నార్వే చేపట్టబోయే తేలియాడే టన్నెల్స్ వంటి మరిన్ని క్లిష్టమైన ప్రాజెక్టులకు మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.








