ఆగిపోయిన అక్కినేని మల్టీస్టారర్
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నాగార్జున(nagarjuna)- నాగచైతన్య(naga chaitanya)- అఖిల్(Akhil) కాంబినేషన్ సినిమా ప్రస్తుతం నిలిచిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలు మొదటిసారి ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్‌లో కనిపించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నట్లు ప్రచారం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కాల్సిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల(Kalyan Krishna Kurasala) దర్శకత్వం వహించనున్నారని, ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే కథకు సంబంధించిన తుది వెర్షన్‌పై పూర్తి స్థాయి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది.
ముఖ్యంగా కథ, పాత్రల తీరు, స్క్రీన్‌ప్లే విషయంలో నాగచైతన్య, అఖిల్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం. స్క్రిప్ట్ పూర్తిగా సంతృప్తి కలిగించని పరిస్థితిలో తొందరపడి సినిమాను మొదలుపెట్టడం కంటే మరింత బలమైన కథ కోసం వేచి చూడడమే మంచిదని అక్కినేని ఫ్యామిలీ భావించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన ప్లాన్స్ కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కెరీర్ పరంగా ముగ్గురు హీరోలు తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నారు. నాగచైతన్య ఇప్పటికే దూత2(dootha2)తో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అఖిల్ కూడా కొత్త కథలను పరిశీలిస్తూ త్వరలో తన తర్వాతి సినిమాను ఫిక్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాపై దృష్టి సారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అక్కినేని ఫ్యామిలీ కలయికలో భారీ మల్టీస్టారర్ కోసం అభిమానులు మరికొంత కాలం ఎదురుచూడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది.








