ప్రభాస్‌కు బాలీవుడ్ స్టార్ల నుంచి డబుల్ ఛాలెంజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ఫౌజీ(Fauzi) సినిమా రిలీజ్ డేట్‌పై నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో ఫ్యాన్స్ లో ఆనందం కనిపిస్తున్నప్పటికీ, అదే టైమ్ లో లో ఈ సినిమా ఎదుర్కోబోయే బాక్సాఫీస్ పోటీపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్లో ఈ సినిమా భారీ సవాల్‌ను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
ఫౌజీ రిలీజైన మరుసటి రోజే అజయ్ దేవ్గన్(Ajay Devgan) ప్రధాన పాత్రలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ రేంజర్(Ranger) ప్రేక్షకుల ముందుకు రానుండగా, మరోవైపు అక్షయ్ కుమార్(Akshay kumar) హీరోగా అనీస్ బజ్మీ(Anees Bajmee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ కూడా అదే డేట్ ను టార్గెట్‌గా పెట్టుకుంది. ఒకే వీకెండ్ లో మూడు భారీ స్టార్ సినిమాలు బరిలో నిలవడం ఈ ఏడాది భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీల్లో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో థియేటర్ల పంపిణీ, షో కేటాయింపులు, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లపై ఈ పోటీ ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఫౌజీలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనుండగా, కొత్త హీరోయిన్ ఇమాన్వి(Imanvi) ఆయనకు జోడీగా నటిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ద్వారా మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. డిసెంబర్ హాలిడే సీజన్ భారీ సినిమాలకు అనుకూలమైన సమయమే అయినప్పటికీ, ఒకే సమయంలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రావడం వల్ల చివరికి ఎవరు రిలీజ్ డేట్ మార్చుకుంటారు? లేక ముగ్గురి పోటీనే కొనసాగుతుందా? అన్న అంశం రానున్న నెలల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.








