టాలీవుడ్ లో వైరలవుతున్న రూమర్లు
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా సినీ అభిమానుల మధ్య రెండు ఆసక్తికరమైన ప్రచారాలు వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒకటి రామ్ చరణ్(ram charan)- సుకుమార్(Sukumar) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నయనతార(Nayanthara) కీలక పాత్ర పోషించబోతున్నారన్న వార్త కాగా, మరొకటి వారణాసి(Varanasi) పూర్తి చేసిన తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తన తదుపరి సినిమాను సూర్య(Suriya)తో చేయాలని ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారన్న ప్రచారం. అయితే ఈ రెండు వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ అంశాలపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఇవి కేవలం సోషల్ మీడియా ఊహాగానాలుగానే కనిపిస్తున్నాయి.
రామ్ చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రస్తుతం డైరెక్టర్ కథను పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇంకా రామ్ చరణ్‌కు ఫైనల్ నరేషన్ కూడా ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. కథకు తుది రూపు వచ్చిన తర్వాతే నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితిలో నయనతార ఇప్పటికే ఈ సినిమాలో భాగమయ్యారన్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఇక రాజమౌళి- సూర్య కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఫుల్ ఫోకస్ వారణాసి పైనే ఉందని, ఆ సినిమా పూర్తయ్యే వరకు తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకునే అలవాటు ఆయనకు లేదని గతంలోనే పలుమార్లు స్పష్టం చేశారు. మరోవైపు సూర్య కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారన్న ప్రచారానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ రెండు కథనాలు ప్రస్తుతం గాసిప్‌లుగానే మిగిలిపోయాయి.








