డొనాల్డ్ ట్రంప్ చిత్రంలో డాలర్ ..!
అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా అధ్యక్షుడు ట్రంప్ ముఖ చిత్రంలో సరికొత్త డాలర్ నాణేన్ని ముద్రించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు.
ఈ నాణేనికి ఒకవైపు ట్రంప్ చిత్రం ఉండగా, దానిపై “లిబర్టీ”, దిగువన “1776-2026” అనే సంవత్సరాలను ముద్రించారు. చిత్రానికి పక్కన “ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్” అని వాక్యం ఉంటుంది. నాణేనికి రెండో వైపు రెక్కలు విప్పిన గద్ద, దాని మధ్యలో 250వ సంఖ్యతో కూడిన రక్షణ కవచం (షీల్డ్) ఉంటుంది. దానిపై “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా”, “వన్ డాలర్” అనే అక్షరాలు ఉంటాయి.
“అమెరికా 250 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ, స్వేచ్ఛకు, దేశభక్తికి చిహ్నంగా ఈ కొత్త బంగారు నాణేన్ని యూఎస్ మింట్ ముద్రించనుంది. ట్రంప్ చిత్రంతో కూడిన ఈ నాణెం అమెరికా విలువలను, స్వేచ్ఛను పరిరక్షిస్తామన్న దేశ నిబద్ధతను చాటుతుంది” అని స్కాట్ పేర్కొన్నారు.
సాధారణంగా అమెరికాలో జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలను కరెన్సీపై ముద్రించకూడదనే నిబంధన ఉంది. అయితే, 250వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల కోసం చట్టంలో మినహాయింపులు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. గతంలో 1926లో అప్పటి అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చిత్రంతో నాణేన్ని విడుదల చేసిన ఉదాహరణను ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.








