క్రికెట్ ప్రేమికులకు ఐసీసీ భారీ సర్ప్రైజ్..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు సరికొత్త మజా అందించేందుకు సిద్ధమైంది. ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ వార్షిక బోర్డు సమావేశంలో పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో విప్లవాత్మక మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టోర్నమెంట్లలో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగాలనే ఉద్దేశంతో, రాబోయే 2028 వన్డే ప్రపంచకప్(World Cup) నుండి సరికొత్త “సూపర్ 7” (Super 7) విధానాన్ని, అలాగే టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ తరహా “సూపర్ 10” (Super 10) ఫార్మాట్‌ను ప్రవేశపెడుతున్నారు.
నూతన నిబంధనల ప్రకారం, 2028 నుంచి జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటున్నప్పటికీ, సెమీఫైనల్స్ చేరే ముందు మూడు రౌండ్ల పాటు ఈ టోర్నీ సాగనుంది. తొలి రౌండ్లో తక్కువ ర్యాంక్ ఉన్న మూడు జట్లు (12, 13, 14 స్థానాలు) “సూపర్ సిరీస్” లో తలపడతాయి, అందులో గెలిచిన ఒకే ఒక్క జట్టు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత మిగిలిన 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి 30 మ్యాచ్‌లు ఆడతాయి. ఈ రెండు గ్రూపుల నుండి టాప్-3 జట్లతో పాటు, ఓవరాల్‌గా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మరో జట్టు కలిపి మొత్తం ఏడు జట్లు “సూపర్ 7” రౌండ్‌కు చేరుకుంటాయి.
ఈ సూపర్ 7 రౌండ్లో ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడాల్సి ఉంటుంది. అనంతరం టాప్-4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. దీనివల్ల గతంలో కంటే ఎక్కువ మ్యాచులు, మరింత డ్రామా ప్రేక్షకులను అలరించనుంది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో కూడా ఐసీసీ భారీ మార్పులు చేపట్టింది. మొత్తం 20 జట్లతో జరిగే ఈ టోర్నీలో పాత పద్ధతి అయిన నాలుగు గ్రూపులను రద్దు చేసి, తొలి దశలో ఐదు గ్రూపులు (ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు) ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన మొత్తం 10 జట్లు “సూపర్ 10” దశకు అర్హత సాధిస్తాయి. ఈ 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా, గ్రూప్ టాపర్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటారు. కాగా, రెండు గ్రూపులలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్ఓవర్ ఎలిమినేటర్ మ్యాచులు ఆడి మిగిలిన రెండు సెమీఫైనల్ స్థానాలను భర్తీ చేస్తాయి. ఈ సరికొత్త నాకౌట్ తరహా విధానం వల్ల టోర్నీ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.








