ఢిల్లీ బాట పట్టనున్న వైఎస్ జగన్..?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అదే సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు, లాకప్ డెత్ వ్యవహారాలూ తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడుల అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కీలక నాయకులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన కేంద్రానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడులు, ఆస్తుల ధ్వంసం మరియు నమోదైన కేసుల వివరాలను ఆయన కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు పార్లమెంట్ వేదికగా జాతీయ మీడియా మరియు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. తమ పార్టీకి ఉన్న ఎంపీల ద్వారా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీ పరిణామాలపై గళం విప్పేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన నాయకులను వేధిస్తున్నారనే కోణంలో కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా, కూటమి ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావచ్చని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








