జనసేన నేతలకు పవన్ పక్కా టార్గెట్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయాల జోష్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలని, జనసేన పోటీ చేసే ప్రతి స్థానంలోనూ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు జనసేన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు పవన్ కళ్యాణ్ పక్కా టార్గెట్లను నిర్దేశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వ్యూహాలకు గట్టి గండి కొట్టాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. గతంలో అధికార బలాన్ని ఉపయోగించి వైసీపీ ఏకగ్రీవాలు చేసుకున్న దుస్థితి మళ్లీ రాకూడదని, ఎక్కడా ఒక్క స్థానం కూడా వైసీపీ ఏకగ్రీవం కాకుండా పటిష్టమైన నిఘా మరియు వ్యూహాలు అమలు చేయాలని ఆయన ఆదేశించారు. కూటమిలోని మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూనే, జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో మేజర్ స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేసిన 21 నియోజకవర్గాల్లోని మేజర్ స్థానిక సంస్థలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. తాను అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్న ఆ 21 స్థానాల పరిధిలోని మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను జనసేన ఖాతాలోనే వేయాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి, క్షేత్రస్థాయిలో పార్టీ మూలాలను మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.








