TRAI: 1600 సిరీస్ కాల్స్‌ను బ్లాక్ చేయలేరు.. కానీ 140 సిరీస్‌కు డీఎన్డీ ఆప్షన్: ట్రాయ్
మొబైల్ వినియోగదారులకు, కాలర్ ఐడీ యాప్‌లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక స్పష్టత ఇచ్చింది. 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను ఏ కాలర్ ఐడీ లేదా స్పామ్-బ్లాకింగ్ యాప్ (ట్రూకాలర్ లాంటివి) కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం, ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
1600 సిరీస్‌కు ప్రత్యేక రక్షణ ఎందుకు?
ఈ 1600 సిరీస్ నంబర్లు సాధారణ ప్రమోషనల్స్ కాల్స్ కోసం ఉద్దేశించినవి కావు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు తమ ప్రస్తుత వినియోగదారులకు లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని (Transactional Info) అత్యవసరంగా అందించేందుకు ఈ సిరీస్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. ప్రజల్లో ఈ కాల్స్‌పై నమ్మకం ఉండేలా, ముఖ్యమైన సమాచారం చేజారిపోకుండా ఉండేలా ఈ నంబర్లకు ట్రాయ్ (TRAI) ప్రత్యేక రక్షణ కల్పించింది.
140 సిరీస్ కాల్స్‌పై నిబంధనలు:
మరోవైపు, 140 సిరీస్ నంబర్లను కేవలం రిజిస్టర్డ్ టెలిమార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ కోసం మాత్రమే కేటాయించినట్లు ట్రాయ్ (TRAI) వివరించింది. వినియోగదారులు ఈ 140 సిరీస్ కాల్స్‌ను అడ్డుకోవాలనుకుంటే.. కేవలం నెట్వర్క్ ప్రొవైడర్ల వద్ద ఉండే ‘డీఎన్డీ’ (Do Not Disturb – DND) రిజిస్ట్రీ ద్వారా మాత్రమే బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అయితే, డీఎన్డీ మినహా యాప్‌ల ద్వారా ఈ 140 నంబర్లను కూడా నేరుగా స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌గా ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ట్రాయ్ హెచ్చరించింది. ఎందుకంటే, వినియోగదారులు గతంలో అనుమతి ఇచ్చిన ప్రమోషనల్ కాల్స్‌ను కూడా యాప్‌లు పొరపాటున స్పామ్‌గా భావించే అవకాశం ఉందని వివరణ ఇచ్చింది.
ట్రూకాలర్ ఆందోళన:
ట్రాయ్ నిబంధనలు ఇలా ఉంటే, ఈ రెండు సిరీస్‌ల నుంచి స్పామ్ కాల్స్ విపరీతంగా పెరుగుతున్నాయని ట్రూకాలర్ (Truecaller) ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంస్థ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ సిరీస్‌ల నుంచి వస్తున్న రోజువారీ 5.1 కోట్లకు పైగా కాల్స్‌కు కస్టమర్లు అసలు స్పందించడమే లేదని తెలిపారు. అంతేకాకుండా, ట్రూకాలర్ యూజర్లు ప్రతిరోజూ సుమారు 4 లక్షల 140 సిరీస్ కాల్స్‌ను, 1.25 లక్షల 1600 సిరీస్ కాల్స్‌ను మాన్యువల్‌గా బ్లాక్ చేస్తున్నారని వెల్లడించారు. అయినప్పటికీ, తాజా నిబంధనల ప్రకారం 1600 నంబర్లను యాప్‌ల ద్వారా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం సాధ్యం కాదని ట్రాయ్ (TRAI) పునరుద్ఘాటించింది








