అర్థరాత్రికి ఇంకా రెండు నిమిషాలే… ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ క్లాక్ కథ ఏంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సంఖ్యలు ఒకటి చెబుతున్నాయి… మార్కెట్లు మరోటి చెబుతున్నాయి… కానీ ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతున్నది మాత్రం ఒక క్లాక్. అది అర్థరాత్రికి ఇంకా రెండు నిమిషాలే మిగిలి ఉన్నాయని చూపిస్తోంది. అసలు ఆ క్లాక్ ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది? ఎందుకు ఆ క్లాక్ ని చూసి ప్రపంచం వణుకుతోంది.. ఆ క్లాక్ వెనక ఉన్న విషయం ఏమిటి?
అది సాధారణ గడియారం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎంత ప్రమాదానికి చేరువైందో సూచించే ‘డెట్ డిఫాల్ట్ క్లాక్’. ఈ డెట్ డిఫాల్ట్ క్లాక్ రివ్యూ కమిటీ ఆదివారం నాడు ఈ క్లాక్ సమయాన్ని ‘అర్థరాత్రికి (midnight)’ మూడు నిమిషాల దూరం నుండి రెండు నిమిషాల దూరానికి మార్చింది. ఈ కమిటీ నిర్వచనం ప్రకారం అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభానికి (fiscal crisis) ఇది చాలా దగ్గరగా చేరినట్లు లెక్క.
ఇవి కూడా చదవండి
సిబిఓ (CBO) అంచనాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలోనే అమెరికా ఫెడరల్ వడ్డీ ఖర్చులు ఏకంగా $1 ట్రిలియన్ డాలర్లకు (లక్ష కోట్ల డాలర్లు) చేరుకోనున్నాయి.అంటే రేపే ఏదో జరిగిపోతుందనే అర్థం కాదు. కానీ ప్రపంచం నిర్లక్ష్యం చేయలేని హెచ్చరిక మాత్రం వినిపిస్తోందన్న మాట.
ఈ హెచ్చరిక వెనుక ఉన్న సంఖ్యలు మరింత కలవరపెడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం కొత్తగా తీసుకునే ప్రతి డాలర్లో దాదాపు 66 సెంట్లు పాత అప్పుల వడ్డీలకే వెళ్తున్నాయని తాజా అంచనాలు చెబుతున్నాయి. అదే సమయంలో అమెరికా జాతీయ అప్పు 39.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే కొత్తగా సంపద సృష్టించే ముందు… పాత అప్పుల భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రపంచం ఎందుకు ఆందోళన చెందుతోంది?
కారణం ఒక్కటే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఒక కేంద్ర బిందువు. అక్కడ చిన్న ప్రకంపన వచ్చినా… దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లు, కరెన్సీలు, పెట్టుబడులపై కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ క్లాక్ ముందుకు కదిలిన ప్రతిసారీ ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతారు.
అయితే భారత్కు ఎందుకు టెన్షన్?
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగితే విదేశీ పెట్టుబడుల ప్రవాహం మందగించవచ్చు. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరగవచ్చు. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు డబ్బు మళ్లితే… బంగారం ధరలు కూడా పెరిగే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సంక్షోభం మరింత తీవ్రమైతే ఏం మారొచ్చు?
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు
డాలర్, రూపాయి మారక విలువలపై ప్రభావం
బంగారం ధరలు పెరిగే అవకాశం
భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడులపై ఒత్తిడి
ఐటీ, ఎగుమతి రంగాలపై ప్రభావం
ఇప్పటికైతే ఈ క్లాక్ ఒక హెచ్చరిక మాత్రమే. కానీ చరిత్ర చెబుతున్న ఒక్క విషయం ఉంది… పెద్ద ఆర్థిక సంక్షోభాలు ఒక్కసారిగా రావు. ముందుగా సంఖ్యలు మారతాయి. తర్వాత మార్కెట్లు స్పందిస్తాయి. చివరికి ప్రపంచం ఆ హెచ్చరికల అర్థాన్ని గ్రహిస్తుంది. ఇప్పుడు ఆ దశలోనే ప్రపంచం నిలబడి ఉందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆర్థిక ప్రపంచం ఎదురుచూస్తోంది.
ఇవి కూడా చదవండి








