కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం.. బుసాన్లో అపెక్స్ కొరియా ప్రారంభం
బుసాన్ లో అపెక్స్ కొరియా పేరిట పెట్టుబడిదారుల సహాయ కేంద్రం
ప్రారంభించిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
బుసాన్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియా ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ లో ఏపీఈడీబీ ఆధ్వర్యాన అపెక్స్ – కొరియా (‘Andhra Pradesh External Engagement – Korea’) పేరిట పెట్టుబడిదారుల సహాయక, అనుసంధాన విభాగం (Investor facilitation and outreach cell)ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిచూపే కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా అనుసంధానకర్తగా పనిచేస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో యూనిట్లను ఏర్పాటుచేసిన సంస్థలకు అవసరమైన సేవలను కూడా అపెక్స్ కొరియా అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఏపీఈడీబీ సీఈవో సగిలి షన్మోహన్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, పరిశ్రమలశాఖ కమిషనర్ శుభం బన్సాల్, దక్షిణకొరియాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.








