బుసాన్ షూఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి నారా లోకేష్
అధునాతన టెక్నాలజీతో బూట్ల తయారీ విధానాన్ని పరిశీలించిన లోకేష్
బుసాన్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియా బుసాన్ లోని ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ షూఆల్స్ (Shoealls) ఫ్యాక్టరీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను ఉత్తేజపరచడం, కండరాల అలసటను తగ్గించడానికి మెడికల్ మాగ్నెటిక్ జనరేటర్లు, చిప్ ల అంతర్నిర్మిత టెక్నాలజీతో షూస్ తయారీ విధానాన్ని మంత్రి లోకేష్ ఆసక్తిగా తిలకించారు. నడకలో అసౌకర్యాన్ని తగ్గించి, పాదాలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రత్యేకమైన మెడిచియో వైబ్రేషన్ చిప్ లను అమర్చే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా షూఆల్స్ ప్రతినిధులు మంత్రికి వివరిస్తూ… మాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్సార్ప్షన్, కూలింగ్ సోల్స్, యాంటీ బాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFDS-సర్టిఫైడ్ మెడికల్ ఫుట్‌వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. థెరపిటిక్ షూస్ ను చేతితో తయారుచేయడమేగాక స్మార్ట్ హెల్త్ కేర్, నొప్పి నివారణ కోసం ఎర్గోనమిక్ డిజైన్ ను వైద్య సాంకేతికతతో మిళితం చేసి బూట్లను తయారు చేస్తామని వారు తెలిపారు. మెడికల్ & ఎర్గోనమిక్ టెక్నాలజీలో తాము పేటెంట్ కలిగి ఉన్నట్లు చెప్పారు. అరికాళ్ళలోని గాలి ప్రసరణకు అనుమతించి, తద్వారా పాదాలను చల్లగా దుర్గంధరహితంగా ఉంచేవిధంగా ఇన్వెన్షియో కూలర్ సిస్టమ్ అమర్చుతున్నట్లు తెలిపారు.








