ఫిలాసఫికల్, ఎమోషనల్ డ్రామా ‘రావు బహదూర్’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు
సంగీతం: స్మరణ్ సాయి, సినిమాటోగ్రఫి: కార్తీక్ పర్మార్
ప్రొడక్షన్ డిజైనర్: అశోక్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బి
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ (GMB Entertainment)
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
రచన, దర్శకత్వం, ఎడిటర్ : వెంకటేష్ మహా
విడుదల తేది : 03.06.2026
నిడివి: 2 ఘంటల 49 నిముషాలు
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణ లో రుపొందుకున్న చిత్రం ‘రావు బహదూర్’. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో దర్శకుడిగా వెంకటేష్ మహా(Venkatesh Maha) అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత నటుడిగా, నిర్మాత, కో ప్రొడ్యూసర్‌గా వెంకటేష్ మహా బిజీగా మారిపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత దర్శకుడిగా రెండో మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఈ సారి సత్యదేవ్‌తో(Satya Dev) ‘రావు బహదూర్’ అంటూ వెంకటేష్ మహా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్‌కి ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) దీర్ఘకాలంగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఎనిమిదేళ్ల పాటుగా ఒకే గదికి పరిమితమై ఒంటరి జీవితాన్ని గడుతుంటాడు. కొన్ని నెలలకు మించి బతకడని డాక్టర్లు తేల్చినా.. వైద్యులను ఆశ్చర్య పరుస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అతని భార్య రేణుక (దీపా థామస్) కూడా మరో గదిలో అలానే 8 ఏళ్ల పాటు బంధీగా ఉంటుంది. కొలనులో పడిపోయి చనిపోయిన చిన్న కొడుకు కుసుమప్ప గురించే ఆలోచిస్తుంటాడు రామప్ప. రాజ భవనాన్ని, తండ్రి బాగుగుల్ని చూసుకుంటూ అతని పెద్ద కొడుకు లవనప్ప ఉండిపోతాడు. ఇక రామప్పకి ఆచారి (వికాస్ ముప్పల) ప్రాణ స్నేహితుడు మాత్రమే కాకుండా వ్యక్తిగత డాక్టర్ వైద్యుడు కూడా. అయితే రామప్పకు లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఇక చనిపోతాడు అని వైద్యులు చెప్పిన ప్రతీ సారి.. తిరిగి వచ్చేస్తాడు రామప్ప. తనకు అనుమానం అనే పెనుభూతం పట్టింది.. అది పోయే వరకు తన దేహం విడిచి ఆత్మ వెళ్లదురా అని తన స్నేహితుడు, వైద్యుడైన ఆచారికి రామప్ప చెబుతాడు.
అయితే అయితే రామప్పను తన జీవితంలో చోటు చేసుకొన్న ఓ విషాద సంఘటన మానసికంగా కుంగదీస్తుంది. ఆ విషాద సంఘటనకు తానే కారణం కుమిలిపోతుంటాడు. ఓ అనుమానం పెనుభూతంలా అతడిని పట్టి పీడిస్తుంది. రామప్ప చివరి రోజులు ఎలా గడిచాయి? కుసుమ తన కొడుకు కాదని రామప్ప నమ్ముతుంటాడు. మరి రామప్ప అనుమానం ఎలా తీరుతుంది? అసలు కుసుమ తన కొడుకు కాదని రామప్ప ఎందుకు అనుకుంటాడు? రామప్ప గతం ఏంటి? రామప్ప వెనక ఉన్న రహస్యాలు ఏంటి? అనుమానం అనే పెనుభూతం నుంచి రామప్పకు చివరకి విముక్తి కలిగిందా? రామప్ప మానసికంగా కుంగిపోకుండా ఆచారి చేసిన ప్రయత్నాలు ఏమిటి? అయిష్టంగా రామప్పను రేణుక ఎందుకు పెళ్లి చేసుకొన్నది. రామప్ప ఎందుకు ఓ కుమారుడిని దత్తత తీసుకొన్నాడు? రామప్ప పెంపుడు కొడుకుకు ఎదురైన అవమానాలు ఏంటి? తనను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న అనుమానం వెనుక రామప్పకు నిజం తెలిసిందా? చివరకు రామప్ప జీవితానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం రావు బహదూర్ సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
సత్యదేవ్ ఆల్ రౌండ్ పెర్పార్మెన్స్తో మరోసారి మెప్పిస్తాడు అతను వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. రకరకాల గెటప్స్, లుక్స్ వాటికి తగ్గట్టుగా డబ్బింగ్లో వేరియేషన్స్.. ఇలా అన్నీ కలిపి సత్య దేవ్ తన టాలెంట్‌ను మరోసారి చూపించినట్టు అనిపిస్తుంది. ఆ తరువాత హీరోయిన్గా రేణుక పాత్రలో దీపా థామస్ ఓకే అనిపిస్తుంది. ఆమెకు అంతగా స్పేస్ దక్కలేదనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల్లో ఆచారి, లవణ, కుసుమ, అచ్చమ్మ ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. చివర్లో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చిన నటుడు ఆనంద్ కూడా మెప్పిస్తాడు. మిగిలిన వారంతా కూడా తమ తమ పాత్రల వరకు ఓకే అనిపిస్తారు.
సాంకేతికవర్గం పనితీరు :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా కొన్ని సన్నివేశాలు నేచురల్‌గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫి డిపార్ట్మెంట్ పెద్దగా కష్టపడాల్సిన సన్నివేశాలు ఏమీ కనిపించవు. అయితే కొన్ని యాంగిల్స్, చూపించిన తీరు కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. ఒకే చోట స్టేజ్ డ్రామాగా కొనసాగడం వల్ల కార్తీక్ పర్మార్ ప్రతిభ పెద్దగా ఎలివేట్ కాలేదనే చెప్పాలి. సినిమాకు వాడిన కలర్ ప్యాటర్న్ స్టోరీ మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ఉపయోగపడింది. దర్శకుడే ఎడిటర్ కావడం వల్ల తాను తీసిన సన్నివేశాలపై ఎక్కువ మమకారం ఉండటం వల్ల సినిమా నిడివి పెరిగి సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా ఇంకా బెటర్‌మెంట్‌కు స్కోప్ ఉంది. క్యాస్టూమ్స్ బాగుంటాయి. తండ్రి కోసం కొడుకు రాసిన కవిత, కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. చివరకు వెంకటేష్ మహా తన విజ్ఞానాన్ని ప్రదర్శించినట్టుగా అనిపిస్తుంది. కానీ అది అందరికీ అదే స్థాయిలో అర్థం అవుతుందా? లేదా? అన్నదే అనుమానం. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
విశ్లేషణ :
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలవడంతో ఉన్నట్టుండి క్రేజ్ పెరిగింది. మూవీ రిలీజ్‌కు ముందు ఆయన వేసిన ట్వీట్‌తో అంచనాలు పెరిగాయి. అయితే తెలుగు సినిమా చూడని కథ అంటూ చెప్పడంతో రావు బహదూర్ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. భ్రమలు, భయాలు, అనుమానాలు అంటూ రకరకాల పేర్లు పెట్టి ఓ సింపుల్ కథను తన నాలెడ్జ్‌ను, పైతాన్ని వెంకటేష్ మహా జోడించినట్టుగా అనిపిస్తుంది. ఇందులో వెంకటేష్ మహా చెప్పాలని అనుకున్నది, చూపించింది ఏంటో.. సామాన్య ప్రేక్షకులకు అర్థం కాక.. ఫస్ట్ హాఫ్‌లోనే బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. తీరా చూస్తే చివరి 10 నిమిషాల క్లైమాక్స్ కోసం రెండున్నర గంటలపాటు సినిమాను సాగదీయడం అత్యంత నిరాశను, అసంతృప్తిని కలిగించే అంశంగా కనిపిస్తుంది. చివరఖరుకు చెప్పెదేటంటే డైరెక్టర్ ఆలోచించిన పాయింట్ బాగుంది. సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉంది.కానీ ఆ పాయింట్‌ను పూర్తిస్థాయి కథగా మార్చడంలో తడబాటు కనిపిస్తుంది. ఎక్కువ మేధావితనం ప్రదర్శించకూడదనే విషయం ఈ సినిమా చెబుతుంది. ఈ సినిమా ఫిలాసఫికల్‌గా ఎమోషనల్ డ్రామా, డాక్టర్, పేషెంట్ డ్రామాను చూడాలంటే ఓపిక వుండాలి. మరి ఈనాటి ప్రేక్షకుడికి ఉంటుందా? కేవలం సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను చూడొచ్చు.








