అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. ప్రధాని మోదీ సూచించిన ఐదు నియమాలివే..
పవిత్ర అమర్నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్ లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ సభ్యులు, వివిధ సంస్థలు భక్తులకు ఆత్మీయ ఆతిథ్యంతో స్వాగతం పలికాయి.జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ వార్షిక యాత్ర కాన్వాయ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ పవిత్ర యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. చందర్‌కోట్ లంగర్ సైట్ వద్ద భక్తులకు అవసరమైన వసతులు, భోజన సదుపాయాలను సిద్ధం చేశారు. పోలీస్, ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), ట్రాఫిక్ పోలీస్, ఆరోగ్య శాఖ, ఫైర్, ఎమర్జెన్సీ లాంటి విభాగాలన్నీ అలర్ట్ అయ్యాయి.
భక్తులకు లేఖ రాసిన ప్రధాని మోదీ
అమరనాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని మోదీ భక్తులకు లేఖ రాశారు. ‘‘హర హర మహాదేవ్.. జై బాబా బర్ఫానీ’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అమర్ నాథ్ యాత్రలో పాల్గొనడం గొప్ప అదృష్టమన్నారు. ఒకే సంకల్పంతో భక్తులు రావడం భారత ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు.
యాత్రికులకు ప్రధాని మోదీ సూచించిన ఐదు సంకల్పాలు
1. పరిశుభ్రత : యాత్ర మార్గంలో పరిశుభ్రతను కాపాడుతూ, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
2. భద్రతా నిబంధనలు పాటిద్దాం…
అధికారులు జారీ చేసే సూచనలు, ట్రాఫిక్ నియమాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి.వర్షాలు, జారుడు మార్గాలు, చలి వంటి పరిస్థితులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
3. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం :
‘‘వోకల్ ఫర్ లోకల్’’ భావనతో యాత్ర ఖర్చులో కనీసం 10 శాతం స్థానిక ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి వినియోగించాలని కోరారు. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవనోపాధికి మద్దతు లభిస్తుందన్నారు.
4. మొక్కను బహుమతిగా ఇవ్వాలి…
యాత్ర ముగిసే రోజు రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరుడు లేదా సోదరికి ఓ మొక్కను బహుమతిగా ఇవ్వాలని, ‘‘తల్లి పేరు మీద ఓ చెట్టు’’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సూచించారు.
5. దేశాభివృద్ధికి కృషి
దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ, అభివృద్ధి చెందిన భారత్ లో భాగస్వాములు కావాలి.
భక్తుల యాత్ర సురక్షితంగా, శుభప్రదంగా సాగాలని మోదీ ఆకాంక్షించారు. బాబా అమర్ నాథ్ ఆశీస్సులు ప్రతి భక్తుడిపై వుండాలని ప్రధాని మోదీ కోరారు.








