మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. కాంగ్రెస్ లో ఎన్సీపీ విలీనం?
మహారాష్ట్రలో సంచలనమైన విషయం బయటికి వస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన పార్టీగా ఎన్సీపీకి, దాని అధినేత శరద్ పవార్ కి ఓ పేరుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీని వెనుక కాంగ్రెస్ అధిష్ఠానంతో తెరువెనుక చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రాథమికంగా శరద్ పవార్ కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమైనట్లు అంటున్నారు.
మహా వికాస్ అగాఢీ లో లుక లుకలు, ప్రస్తుత రాజకీయాల కారణంగా శరద్ పవార్ విసిగిపోయినట్లు తెలుస్తోంది. మహా వికాస్ అగాఢీ అధికారంలో వున్న సమయంలో శరద్ పవార్ ఎంత చెబితే అంతలా రాజకీయాలు నడిచాయి. కానీ.. మహా వికాస్ అగాఢీని, మరీ ముఖ్యంగా ఉద్ధవ్ వర్గంలో చీలిక రావడం, రాజకీయాలు మారిపోవడంతో శరద్ పవార్ ఈ నిర్ణయానికి వచ్చారు.
ఒకవేళ ఈ విలీనం జరిగితే మాత్రం మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. మహారాష్ట్ర రాజకీయాలకు పెద్ద దిక్కుగా వున్న శరద్ పవార్ ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే లెక్క. అజిత్ పవార్ దివంగతులయ్యారు. ఉద్ధవ్ తిరుగుబాటుతో సతమతమవుతున్నారు.
అయితే.. ఈ విలీన ప్రతిపాదన పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎన్సీపీలో ఏకాభిప్రాయం తర్వాతే ఢిల్లీలో విలీనం పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా కాంగ్రెస్ ను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ సాయంతో కాంగ్రెస్ ను దీటుగా తయారు చేయాలని అనుకుంటున్నారు.








