పంజాబ్ పై కాంగ్రెస్ దృష్టి… మనీష్ తివారీ మిస్..
వచ్చే యేడాది పంజాబ్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. ఎలాగైనా పంజాబ్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో వుంది. ప్రస్తుతం అక్కడ ఆప్ అధికారంలో వుంది. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తేవాలని అధిష్ఠానం పట్టుదలతో వుంది.
ఈ నేపథ్యంలో యేడాది వుండగానే.. ఎన్నికల ప్రచార కమిటీని ప్రకటించేసింది. ప్రచార కమిటీకి అధ్యక్షునిగా మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చెన్నీని అధిష్ఠానం ప్రకటించేసింది. మిగతా వారిని కూడా అందులో సభ్యులుగా చేర్చింది. అయితే.. అత్యంత సీనియర్ అయిన మనీష్ తివారీని మాత్రం పక్కన పెట్టేశారు. ఏ కమిటీలో కూడా స్థానాన్ని ఇవ్వలేదు.
దీంతో ఆయన బహిరంగంగానే ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.‘అసలు నైపుణ్యాలు ఉండటమే ఒక పెద్ద తప్పు లాగా ఉంది. జనాల అభద్రతా భావాలను తొలగించే మార్గం నాకు తెలిసుంటే బాగుండేది. కాంగ్రెస్ నాకు గత 45 ఏళ్లల్లో ఎన్నో అవకాశాలు ఇచ్చింది. నేనూ నా జీవితాన్ని పార్టీకి అంకితం చేశాను. కానీ జీవితంలో ఏది రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది’ అని ఆయన ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. అయితే, మనీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న చండీగఢ్ రాష్ట్రం పరిధిలోకి రాకపోవడంతో ఆయనకు ఎన్నికల బృందంలో చోటు దక్కలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తివారీ గతంలో లూథియానా, ఆనంద్పూర్ లోక్సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు.








