ఆత్మ నిర్భర భారత్, పరిపాలనా సంస్కరణలే లక్ష్యం : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.సంస్కరణలు, ఆత్మ నిర్భర భారత్, పరిపాలనా సంస్కరణలను వేగవంతం చేయడం అన్న మూడు ప్రధాన అంశాలపైనే సమావేశం జరిగింది. అలాగే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం విషయంపై కూడా ఇందులో చర్చ జరిగింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ ను మరింత మెరుగుపరచడం, విధానపరమైన చర్యలు, సంస్థాగత సంస్కరణల ద్వారా ఆత్మ నిర్భర భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై లోతైన చర్చ జరిగింది. అలాగే ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం కనిపించే పథకాలపై ప్రత్యేక దృష్టి నిలపాలని మోదీ ఆదేశించారు. నియంత్రణల తొలగింపు, ఇతరత్రా తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చ ప్రధానంగా సాగింది.
దేశంలో సులభతర వాణిజ్యం, ప్రజల సౌకర్యవంతమైన జీవనానికి బాటలు వేసేలా నిబంధనల సడలింపులతో పాటు ఆ మేరకు సంస్కరణలు తేవాలని సూచించారు. ఆయా శాఖలు, తమ పురోగతిపై కార్యదర్శులు మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ఆయా రంగాలకు ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలను కూడా చర్చించారు. అయితే శాఖల మధ్య సమన్వయం కావాలని, ఎవరికి వారే తమది వేరే శాఖ అన్నట్లు వుండొద్దని మోదీ నొక్కి చెప్పారు. శాఖల మధ్య సమన్వయం, ఒకరి నిర్ణయాలు ఒకరు తెలుసుకునేందుకు ‘‘పీఎం గతిశక్తి’’ ని బాగా వినియోగించుకోవాలని మోదీ సూచించారు.
మరోవైపు 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన సంస్కరణల గురించి కూడా చర్చించారు. దీని కోసం ఓ సమగ్ర ప్రణాళికను వివరించారు. ప్రజల జీవితాల్లో సౌకర్యాన్ని కల్పించడం, జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడం ఎల్లప్పుడూ తమ లక్ష్యం కావాలని సూచించారు.అలాగే అన్ని శాఖలు కూడా ఆధునిక సాంకేతికతను జోడించుకోవాలని సూచించారు.








