19 ఏళ్ళు మూడు శంకుస్థాపనలు.. ఇప్పుడైనా పూర్తవుతుందా..?
వైఎస్సార్ కడప(Kadapa) జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. జూలై 3న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, 2007 నుంచి ఇప్పటివరకు వరుసగా వచ్చిన ముఖ్యమంత్రులంతా శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేస్తూనే ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఒక్క ఇటుక కూడా పడకపోవడంపై రాయలసీమ వాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి వేయబోయే పునాది రాయి అయినా ప్రాజెక్టు పూర్తికి దారితీస్తుందా.. లేక గత చరిత్ర పునరావృతమవుతుందా? అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ, విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా.. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలతో పాటు కడప స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇచ్చిన మాటను పూర్తిగా విస్మరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు విఫలమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం చేతులెత్తేయడంతో, రాష్ట్ర ప్రభుత్వమే ఈ భారీ ప్రాజెక్టును మోయాల్సి వస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది.
కడప స్టీల్ ప్లాంట్ చరిత్రను గమనిస్తే.. ఇదొక శంకుస్థాపనల రికార్డుగా నిలిచిపోతుంది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో జమ్మలమడుగు వద్ద మొదటిసారి శంకుస్థాపన చేశారు. అది ముందుకు సాగలేదు. విభజన తర్వాత 2018లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) సున్నిపెంట వద్ద శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే 2019 డిసెంబర్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) కడప స్టీల్ ప్లాంట్‌కు మూడోసారి పునాది రాయి వేశారు.
ఆయా కంపెనీల బోర్డులు మారడం, శంకుస్థాపనల శిలాఫలకాలు పడటమే తప్ప ప్రాజెక్టు మాత్రం అంగుళం కూడా ముందుకు కదల్లేదు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ప్రతిపక్షాలు మరియు ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలోకి వచ్చే ప్రైవేట్ స్టీల్ ప్రాజెక్టులకు మరియు ఇతర పారిశ్రామిక దిగ్గజాలకు వేల కోట్ల రూపాయల విలువైన భూములు, విద్యుత్, నీటి రాయితీలను గుమ్మరిస్తున్న పాలకులు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాల్సిన కడప స్టీల్ ప్లాంట్‌కు మాత్రం నిధులు కేటాయించడంలో వెనుకాడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు జూలై 3న జరగబోయే శంకుస్థాపన అయినా రాయలసీమ నిరుద్యోగుల ఆశలను నిజం చేస్తుందో, లేక కేవలం ఎన్నికల, రాజకీయ ప్రచార అస్త్రంగానే మిగిలిపోతుందో కాలమే సమాధానం చెప్పాలి.








