సిలికానాంధ్ర 25 ఏళ్ల ప్రస్థానం
జూలై 31 నుంచి ఆగస్టు 1 వరకు సిల్వర్ జూబ్లి వేడుకలు
అమెరికాలో తెలుగు సంస్కృతీ వైభవాన్ని, ఖ్యాతిని చాటిచెప్పేలా సిలికానాంధ్ర 25 ఏళ్ల ప్రస్థాన మైలురాయిని పురస్కరించుకుని జూలై 31 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు రజతోత్సవ వేడుకలను కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ఓక్లాండ్ ఎరీనా వేదికగా నిర్వహించనున్నారు. సుమారు 15 వేల మందికి పైగా ప్రవాస తెలుగువారి సమక్షంలో ఈ సంబరాలు జరగనున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తెలుగు సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించారు. ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మార్గదర్శకత్వంలో సిలికానాంధ్ర ప్రస్తుత అధ్యక్షురాలు సత్యప్రియా తనుగుల, సిల్వర్ జూబ్లీ కమిటీ చైర్ స్నేహా వేదుల, కో-కన్వీనర్లు వంశీ కృష్ణ నాదెళ్ల, నరాల కవిత, మరియు రఘు మల్లాది తదితరులు ఈ వేడుకలకోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకోసం అమెరికా మరియు ఇతర దేశాల నుండి 5000 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ ‘సాంస్కృతిక ఒలింపిక్స’ ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడేలా ఉంటుందని,ఈ అపూర్వమైన వేడుకలకు ప్రవాస తెలుగువారందరూ కుటుంబసమేతంగా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని కార్యక్రమాలు గిన్నిస్ రికార్డును సృష్టించేలా ఉంటాయని చెప్పారు.
అమెరికా గడ్డపై అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పెద్ద ఎత్తున తెలుగు సంస్కృతి సంప్రదాయాల కలయికతో ఒక కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల కోసం ఓక్లాండ్ ఎరీనాలో 60/40 అడుగుల భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 300 మందికి పైగా వాలంటీర్లు కొన్ని నెలలుగా అహర్నిశలు శ్రమిస్తూ, దాతల సహకారంతో ఈ బృహత్ ప్రణాళికకు రూపకల్పన చేశారు.
ఇవి కూడా చదవండి
నిర్వాహకుల సమావేశాలు
ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సిలికానాంధ్ర నిర్వాహకుల సమావేశాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ, కార్యక్రమాల నిర్వహణలో పాల్గొంటున్నవారికి సూచనలను అందజేస్తున్నారు. ఏర్పాట్లపై కూడా చర్చించుకుంటా మార్పులు, చేర్పులను చేస్తున్నారు.
ఎన్నో కార్యక్రమాలు
ఈ వేడుకలకోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సంగీత అమృతవర్షిణి, లయ అమృతవర్ణిణి, కూచిపూడి నాట్య అమృతవర్షిణి, లలిత గీత అమృతవర్షిణి, శతక శంఖారావం, వందేభారతం, దక్షయఙం, జానపదజాతర వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
కుంభహారతి
అమెరికాలో ఓ తెలుగు కార్యక్రమంలో ఇలాంటి వేడుక నిర్వహించడం ఇదే ప్రథమం. ఇందులో 108 డ్యాన్సర్లు, 108 కలశాలతో అలరించనున్నారు.
శతక శంఖారావం
శతక శంఖారావం పేరుతో తెలుగు జీవితానికి మార్గదర్శకాలుగా నిలిచిన సుమతీ శతకం, వేమన శతకాల్లోని 18 అద్భుతమైన పద్యాలను దాదాపు 2000 మంది పిల్లలు, పెద్దలు కలిసి ఒకే వేదికపై కంఠస్థం చేసి పఠించనున్నారు. ఈ అరుదైన ప్రదర్శన ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
జానపద జాతర
జానపద జాతర పేరుతో తెలుగునాట ఎంతో ప్రాముఖ్యత కలిగిన తప్పెట గుళ్ళు, లంబాడి, కోయ, కొమ్ముకోయ, పులివేషాలు, గొండు, మరియు గుస్సాడి వంటి ఎన్నో సాంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 9 ఏళ్ల పిల్లల నుండి 99 ఏళ్ల వృద్ధుల వరకు ఈ ప్రదర్శనలలో భాగస్వామ్యం కానున్నారు.
వందే భారతం
వందే భారతం పేరుతో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక గీతాలాపన మరియు నృత్య రూపకాలతో కూడిన స్మరణార్చన చేయనున్నారు. సంగీత, నృత్య ఝరి.
సంగీతామృత వర్షిణి
సంగీతామృత వర్షిణి కార్యక్రమంలో సుమారు 1,000 మందితో కూడిన భారీ కర్ణాటక సంగీత కచేరీ నిర్వహించనున్నారు. అన్నమయ్య, త్యాగరాజు వంటి ఐదుగురు దిగ్గజ వాగ్గేయకారుల కీర్తనలను ఇందులో ఆలపిస్తారు.ఇందుకోసం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులను, ఇతర కళాకారులను ఆహ్వానించారు. కూచిపూడి నాట్యామృత వర్షిణి కూచిపూడి నాట్యామృత వర్షిణి కార్యక్రమంలో 400 మందికి పైగా కళాకారులతో అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉండనున్నాయి.
కళా కదంబం, నాటకాలు తెలుగు సాంప్రదాయ పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు 64 కళలలోని విశిష్ట రూపాలైన ధ్వన్యనుకరుణ (మిమిక్రీ), మాయాజాలం (మ్యాజిక్), మూకాభినయం (మైమ్), గారడీ, మరియు బుడబుక్కల వంటి ఎన్నో విచిత్ర వేషధారణల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
రిజిస్ట్రేషన్ల వివరాలు:ఈ చారిత్రాత్మక రజతోత్సవ సంబరాలలో పాల్గొనాలనుకునే ప్రవాసాంధ్రులు, కళాకారులు సిలికానాంధ్ర అధికారిక వెబ్సైట్ silverjubilee.siliconandhra.org ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.








