సూర్యవంశిని దించండి: సునీల్ గవాస్కర్..!
ఐర్లాండ్ పర్యటనలో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని(Vaibhav Suryavanshi) మొదటి టీ20 మ్యాచ్‌లోనే తుది జట్టులోకి తీసుకోవాలంటూ భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సునీల్ గవాస్కర్ సోనీ స్పోర్ట్స్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మొదటి మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీని బరిలోకి దింపితే భారత్‌కు మంచి ఆరంభం లభిస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐర్లాండ్ సిరీస్‌లో భారత్ ఆడిన విధానాన్ని ఇంగ్లండ్ బౌలర్లు గమనించి ఉంటారు కానీ, వైభవ్ ఆ సిరీస్‌లో ఆడకపోవడం వల్ల అతడిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు పెను సవాల్‌గా మారుతుందని విశ్లేషించారు. ఐపీఎల్లో అతడి భయమెరగని హిట్టింగ్ వీడియోలు మినహా, ఇంగ్లండ్ బౌలర్లకు అతడి టెక్నిక్‌పై పెద్దగా అవగాహన లేకపోవడమే భారత్‌కు కలిసొచ్చే అంశమని గవాస్కర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్లో అభిషేక్ శర్మ(Abhishek Sharma), సంజు శాంసన్(sanju Samson) అత్యద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారని, అందువల్ల బాగా సెట్ అయిన ఈ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసి 15 ఏళ్ల వైభవ్‌కు చోటు కల్పించడం మేనేజ్మెంట్కు కత్తిమీద సామేనని గవాస్కర్ ఒప్పుకున్నారు. అయితే, ఒకవేళ అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాకపోయినా, డగౌట్లో కూర్చుని సీనియర్ ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారు, వైఫల్యాల నుంచి ఎలా నేర్చుకుంటున్నారో గమనించడం ఈ వయసులో అతడికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
డగౌట్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి సీనియర్లు వైభవ్‌కు గైడెన్స్ ఇవ్వడం భారత క్రికెట్‌కు చాలా శుభపరిణామమని ఆయన కొనియాడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ద్వయంపై వస్తున్న విమర్శలపైనా గవాస్కర్ స్పందించారు. ఐర్లాండ్ చేతిలో 2-0తో సిరీస్ ఓడిపోవడం జీర్ణించుకోలేని విషయమే అయినప్పటికీ, ఏ కొత్త బంధానికైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని, కాబట్టి అభిమానులు, విశ్లేషకులు కొంచెం సహనంతో ఉండాలని సూచించారు. శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్, ఐపీఎల్ లెవెల్లో కెప్టెన్‌గా తన సత్తా చాటినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ వేదిక అనేది ఒక భిన్నమైన ప్రపంచమని, రాబోయే ఐదు మ్యాచ్‌లలో అతని ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలని గవాస్కర్ స్పష్టం చేశారు.








