సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. సూర్య48 అధికారికంగా సెట్స్‌పైకి
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) తన తదుపరి సినిమాతో మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్(TJ Gnanavel)తో కలిసి రూపొందుతున్న సూర్య48(Suriya48) సినిమాకు తాజాగా ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అధికారికంగా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్(Hombale Films) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభ వేడుకకు సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా, అవి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సూర్య- జ్ఞానవేల్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జై భీమ్(Jai Bhim) విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడదే కాంబినేషన్ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా కథను రూపొందిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కథ, పాత్రల రూపకల్పనలో కొత్తదనం చూపించేందుకు మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రారంభ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్, హీరోయిన్ కయాదు లోహర్(Kayadhu lohar), నిర్మాతలు విజయ్ కిరగందూర్(Vijay kiragandur), చలువే గౌడ(Chaluve gowda)తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్(Sai Abhyankar), సినిమాటోగ్రాఫర్‌గా ఎస్.ఆర్. కతీర్(SR Kathir), ఎడిటర్‌గా ఫిలోమిన్ రాజ్(Philomin raj) పనిచేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. షూటింగ్ షెడ్యూల్‌ను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.








