జననాయగన్ కు ఏమైంది? రిలీజ్ కంటే పెద్ద సస్పెన్స్ ఇదే!
విజయ్(Vijay) సినీ కెరీర్‌కు ఆఖరి సినిమాగా అనౌన్స్ చేసిన జన నాయగన్(Jana Nayagan) మొదట అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టించింది. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో ఇది హిస్టారికల్ రిలీజ్ గా నిలుస్తుందని భావించారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ సినిమా వరుస అడ్డంకులతో వార్తల్లో నిలుస్తోంది. సెన్సార్ ప్రక్రియలో మొదలైన సమస్యలు రివైజింగ్ కమిటీ వరకు వెళ్లగా, అనంతరం మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ న్యాయపరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిర్మాతలు సూచించిన మార్పులకు అంగీకరించినప్పటికీ రిలీజ్ కు మార్గం సుగమం కాలేదు. ఒక దశలో రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ కూడా వాయిదా పడటంతో సినిమా భవిష్యత్తుపై మరింత అనిశ్చితి నెలకొంది.
ఈ మొత్తం వ్యవహారంలో విజయ్ మౌనం కూడా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పూర్తిగా పాలన, ప్రభుత్వ కార్యక్రమాలపైనే దృష్టి సారించడంతో జననాయగన్ గురించి బహిరంగంగా పెద్దగా స్పందించలేదు. ఫ్యాన్స్ మాత్రం సినిమా రిలీజ్‌పై ఆయన నేరుగా జోక్యం చేసుకుని క్లారిటీ ఇస్తారని ఆశించినా అలాంటి పరిస్థితి కనిపించలేదు. అయితే రిలీజ్ ఆలస్యం మరింత పెరిగితే డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థికంగా నష్టపరిహారం అందించేందుకు విజయ్ రెడీగా ఉన్నారని వచ్చిన వార్తలు, ఈ ప్రాజెక్ట్‌ను ఆయన పూర్తిగా పక్కన పెట్టలేదనే సంకేతాలను ఇచ్చాయి.
ఇదిలా ఉండగా, జననాయగన్ నిర్మాత కె. వెంకట్ నారాయణ(K venkata narayana)ను విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం కొత్త చర్చకు దారితీసింది. ఈ నియామకానికి సినిమా భవిష్యత్తుతో ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్ చివరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన జననాయగన్ ఇప్పుడు రిలీజ్ డేట్ కంటే, అసలు ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లకు చేరుతుందా లేదా అన్న ప్రశ్నతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.








