కాన్సుల్ జనరల్ డి.సి.మంజునాథ్‌తో ‘టీసీఏ’ నూతన కార్యవర్గం భేటీ
ఎన్నారైలలో తెలుగు భాషా వికాసానికి, సాంస్కృతిక పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తెలుగు సాంస్కృతిక సమితి (TCA) 2026–2027 నూతన కార్యవర్గ ప్రతినిధులు ఒక ముఖ్యమైన అధికారిక సమావేశాన్ని నిర్వహించారు. టీసీఏ అధ్యక్షులు యాదగిరి రెడ్డి నేతృత్వంలోని కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, ప్రముఖులు చార్లీ చౌదరితో కలిసి భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో ప్రవాసంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు, తెలుగు సమాజ ఐక్యతను బలోపేతం చేయడం , భావి తరాల యువతలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించే పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ భేటీలో భాగంగా రాబోయే ఆగస్టు 7, 8 తేదీలలో జరగనున్న అత్యంత చారిత్రక టీసీఏ స్వర్ణోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా కాన్సుల్ జనరల్ గారిని కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ 50 ఏళ్ల పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా , ఘనంగా నిర్వహించేందుకు టీసీఏ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రతినిధులు స్పష్టం చేశారు.








