ఐమ్యాక్స్ హైదరాబాద్‌కు రావడంపై రాజమౌళి రియాక్షన్
రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వారణాసి(Varanasi) 2027లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, అదే సమయంలో హైదరాబాద్‌లో ఐమాక్స్(Imax) థియేటర్ల పునరాగమనం జరగడం సినీ అభిమానులకు ప్రత్యేకమైన సందర్భంగా మారనుంది. ఈ పరిణామంపై స్పందించిన రాజమౌళి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, హైదరాబాద్‌కు మళ్లీ ఐమాక్స్ రావడం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సినీ అభిమానులని, వారు తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, హాలీవుడ్ సినిమాలను కూడా సమానమైన అభిమానంతో ఆదరిస్తారని పేర్కొన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ, సినిమా అనేది తెలుగు ప్రేక్షకుల జీవితంలో ఒక ఎమోషన్ అని అన్నారు. ప్రపంచంలోని ఏ భాషలో మంచి సినిమా వచ్చినా దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించే ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి సినీ ప్రేమికులకు అత్యాధునిక ఐమాక్స్ అనుభవం అందుబాటులో ఉండటం చాలా అవసరమని, వారు దానికి పూర్తిగా అర్హులని వ్యాఖ్యానించారు.
గతంలో ప్రసాద్ ఐమాక్స్‌లో వరల్డ్ లెవెల్ 70ఎంఎం ప్రొజెక్టర్ ఉండేదని గుర్తు చేసుకున్న రాజమౌళి, ఐమాక్స్ డిజిటల్ వ్యవస్థలోకి మారిన తర్వాత హైదరాబాద్ ఆ స్పెషాలిటీని కోల్పోయిందని తెలిపారు. ఇతర నగరాల్లో ఐమాక్స్ థియేటర్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో లేకపోవడం సినిమా ప్రేమికుడిగా తనను నిరాశకు గురిచేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఐమాక్స్ నగరానికి తిరిగి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, వారణాసి లాంటి విజువల్ గ్రాండియర్‌ను ప్రేక్షకులు అత్యుత్తమ సాంకేతిక నాణ్యతతో ఆస్వాదించే అవకాశం దక్కడం మరింత ప్రత్యేకమని ఆయన అన్నారు.








