“చచ్చిపోయిన డైనోసార్‌కు విలువ.. బతికున్న మనుషులకు లేదా? ‘కెనాతా కానోమ్’ మూవీ రివ్యూ”
Rating: 2
—సూర్య ప్రకాష్ జోశ్యుల
తమిళనాడులోని ఓ మారు మూల గ్రామం. కరువుకి కేరాఫ్ ఎడ్రస్. వర్షాలు ఎప్పుడో ఆ ఊరిని బ్లాక్‌లిస్ట్ చేసినట్టుగా ఉంటుంది పరిస్ధితి. దాంతో ఆ ఊరి జనం నీటి కోసం నానా అవస్థలు పడుతుంటారు. ముఖ్యంగా తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం నడిచివెళ్తూంటారు.
ఇక ఆ ఊళ్లోనే తన తాతయ్యతో కలిసి జీవిస్తుంటాడు మణివాసగర్ (యోగిబాబు). అతనో గుడిలో పూజారి. ఖాళీ సమయంలో శిల్పి.కెనాతా కానోమ్ దేవుళ్ల విగ్రహాలు చెక్కగలడు కానీ తన జీవితాన్ని మాత్రం చెక్కుకోలేకపోతున్నాడు. కారణం? కరువు ప్రభావం తన ప్రేమ మీద కూడా పడటమే.
లక్ష్మీ అనే అమ్మాయి అతడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి “నీళ్లు లేని ఊళ్లోకి మా అమ్మాయిని ఇవ్వలేను” అని తేల్చేస్తాడు. కరెక్ట్ గా ఆ టైమ్ లోనే ఆ ఊరి వాళ్లు ఓ భూగర్భ జలాల నిపుణుడిని తీసుకొస్తారు. అతను కర్ర పట్టుకుని ఊరంతా తిరిగి చివరకు మణి ఇంటి ముందు చూపిస్తూ…”ఇక్కడ తవ్వండి… నీళ్లు పుష్కలంగా పడతాయి!” అని తేలుస్తాడు.
అంతే! మణి జీవితంలో వసంతం చిగురిస్తుంది. పెళ్లి మాటలు మళ్లీ మొదలవుతాయి. గ్రామస్థులు అందరూ కలిసి మణి ఇంటి ముందు బావి తవ్వడం ప్రారంభిస్తారు. కానీ విధికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ.
దాంతో తవ్వుతుంటే నీళ్లు పడతాయో అనుకుంటే… వేల సంవత్సరాల నాటి డైనోసార్ అస్థిపంజరం బయటపడుతుంది! ఊరంతా షాక్..వాళ్లు ఆ షాక్ నుంచి తేరుకునేలోగా..ఒక్కసారిగా మీడియా వాహనాలు, కెమెరాలు, మైకులు ఊరిని ముంచెత్తుతాయి. నిన్నటి వరకు తాగునీరు అడిగితే పట్టించుకోని అధికారులు, ఇప్పుడు డైనోసార్ పేరు వినగానే పరుగెత్తుకుంటూ వస్తారు.
“ఇది జాతీయ సంపద!”, “ఈ ప్రాంతం పురావస్తు పరిరక్షణలోకి వస్తుంది!” , “ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది!” అని ప్రకటనలు మొదలవుతాయి. మణికి ఏం చేయాలో అర్దం కాదు. ఇన్నేళ్లు తమ ఊరికి నీళ్లు ఇవ్వమని ఎంత తిరిగినా పట్టించుకోని ప్రభుత్వం, ఇప్పుడు తమ భూమిని తీసుకెళ్లడానికి మాత్రం రాత్రికి రాత్రే వచ్చేసింది. “బతికున్న మనుషుల కంటే… చచ్చిపోయిన డైనోసార్ విలువ ఎక్కువా?” వాళ్లకు సందేహం వస్తుంది. అక్కడి నుంచే కథ మరో టర్న్ తీసుకుంటుంది.
ఒక వైపు అవినీతి రాజకీయ నాయకులు ఈ పరిస్థితిని తమ లాభాలకు వాడుకోవాలని చూస్తారు. మరోవైపు అధికారులు చట్టాల పేరుతో గ్రామస్థులను భయపెడతారు. మీడియా తమకు నచ్చిన కథ చెబుతుంది. సోషల్ మీడియాలో డైనోసార్ స్టార్ అయిపోతుంది. కానీ అసలు సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఊరికి ఇంకా నీళ్లు లేవు. అప్పుడు ఓ అనుకోని సంఘటన జరుగుతుంది. దాంతో ఊరు మొత్తం ఇరుకున పడుతుంది. ఆ సంఘటన ఏమిటి… చివరకు ఆ ఊరి నీటి సమస్య తీరిందా…డైనోసార్ అస్దిపంజరం మేటర్ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నీళ్లు కోసం బావి తవ్వుతూంటే వేల సంవత్సరాల నాటి డైనోసార్ అవశేషాలు బయటపడటం అనే స్టోరీ లైన్ వినగానే “అరే… ఇది భలే కొత్త ఐడియా!” అనిపిస్తుంది. ఇందులో వ్యంగ్యం, రాజకీయ వ్యాఖ్యానం, గ్రామీణ జీవితం ఉంది, వ్యవస్థపై ప్రశ్నలు ఉన్నాయి అనిపిస్తుంది. అయితే ఆ కథను స్క్రిప్టు గా చేయటానికి అంతటి బలమైనన స్క్రీన్ ప్లే అవసరం అని అర్దం అవుతుంది. ఇక్కడే కెనాతా కానోమ్ తడబడింది. ఈ సినిమాలో కొత్త ఐడియా ఉంది. కానీ ఆ ఐడియాతో ప్రేక్షకుడు కలిసి నడిచేలా చేసే భావోద్వేగ ప్రయాణం మాత్రం లేదు.
సినిమా మొదలైన తర్వాత చాలా సేపువరకూ అసలు కథలోకి వెళ్లరు. అప్పటి దాకా మణివాసగర్ ప్రేమకథ, గ్రామంలోని చిన్న చిన్న సంఘటనలు, అక్కడి మనుషుల దైనందిన జీవితం ఇలా అనేక సన్నివేశాలు వస్తుంటాయి. కానీ అవి కథను ముందుకు తీసుకెళ్లే బదులు, కేవలం స్క్రీన్‌ప్లేను నింపడానికి పెట్టిన సన్నివేశాల్లా అనిపిస్తాయి.
అంతేకాదు ఈ సినిమా ప్రతి అరగంటకో కొత్త కథగా మారిపోతుంది. మొదట ఇది ప్రేమకథలా మొదలవుతుంది. తర్వాత నీటి సమస్యపై రూరల్ డ్రామాగా మారుతుంది. డైనోసార్ ఎముకలు బయటపడిన తర్వాత పురావస్తు శాఖ కథగా మారుతుంది. కొద్దిసేపటికే ఇది భూహక్కుల పోరాటంగా మారిపోతుంది. తర్వాత రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వ అధికారుల అహంకారం, గ్రామస్థుల అమాయకత్వం, మహిళా సాధికారత వంటి అనేక అంశాలు వరుసగా వస్తుంటాయి. సమస్య ఏమిటంటే… వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా సినిమా పూర్తిగా పరిశీలించదు. దాంతో మనం ఏ ఎమోషన్ తోనూ , ఆలోచనతోనూ పూర్తి జర్ని చేయం.
దర్శకుడు వెట్రిమారన్ ఒక ఇంటర్వ్యూలో “ఒక కథలో చాలా ఐడియాలు ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక భావన మాత్రం మిగలాలి” అని చెప్పారు. కెనాతా కానోమ్ చూస్తే ఆ మాట ఎందుకు ముఖ్యమో అర్థమవుతుంది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకుడికి ఏ ఆలోచనతో బయటకు రావాలో కూడా స్పష్టంగా తెలియదు.
నిజానికి మణివాసగర్ పాత్రలో భావోద్వేగానికి చాలా అవకాశం ఉంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోవడం, కరువు కారణంగా అవమానాలు ఎదుర్కోవడం, తన ఇల్లు-భూమి కోల్పోయే పరిస్థితి రావడం, వ్యక్తిగత నష్టాలను అనుభవించడం వంటి అనేక సందర్భాలు అతని పాత్రను బలంగా నిలబెట్టే అవకాశాలు. కానీ స్క్రీన్‌ప్లే వాటిని లోతుగా అన్వేషించదు. సంఘటనలు జరుగుతాయి. కానీ వాటి ప్రభావం ప్రేక్షకుడి మనసుకు చేరదు. అందుకే యోగిబాబు పాత్ర కథలో ప్రధాన పాత్రే కానీ దాన్ని లీడ్ చేస్తున్నట్లు ఉండదు. అతను ఏ నిర్ణయాలు తీసుకోడు. వాటి ఇంపాక్ట్ సంఘటనలపై పడదు. అంటే యోగిబాబు చేతిలోకి కథవెళ్లలేదు. కథ చేతిలోనే యోగిబాబు ఉండిపోయాడు.
మరో ఇంట్రస్టింగ్ విషయం సినిమా టోన్. ఇది రాజకీయ వ్యంగ్యమా? కామెడీనా? ఎమోషనల్ డ్రామానా? సినిమా చివరి వరకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతుంది. గ్రామస్థులపై జరిగే పోలీసు దౌర్జన్యం వంటి సన్నివేశాల తర్వాత వెంటనే హాస్యానికి మారిపోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. నవ్వు రావాల్సిన చోట నవ్వు రాదు. బాధ కలగాల్సిన చోట బాధ కలగదు. దీనికి కారణం స్క్రీన్‌ప్లేలో ఎమోషన్స్ మధ్య నేచురల్ ప్లో లేకపోవడమే.
అయితే కథగా చూస్తే మంచి సెటైర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సంవత్సరాలుగా నీళ్లు అడిగినప్పుడు పట్టించుకోని వ్యవస్థ, డైనోసార్ ఎముకలు బయటపడగానే ఒక్కసారిగా చురుకుగా మారటం. అలాగే బతికున్న మనుషుల కష్టాల కంటే చనిపోయిన జీవి అవశేషాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనే వ్యంగ్యం చాలా పదునైనది. దురదృష్టవశాత్తూ సినిమా ఈ అంశాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయింది.
కెనాతా కానోమ్ ఒక మంచి ఐడియా చుట్టూ తిరిగే సినిమా. కానీ ఆ ఐడియాను గొప్ప సినిమాగా మార్చుకోలేని కథనం . ఐడియాలు చాలా ఉన్నాయి. కానీ వాటిని కలిపే దారము లేదు. సందేశాలు చాలా ఉన్నాయి. కానీ వాటిని మోసే భావోద్వేగం లేదు.
టెక్నికల్ గా..
త్యాగరాజన్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించగా, నివాస్ కె ప్రసన్న సంగీతం కథకు అవసరమైన మూడ్‌ను అందించింది. రామర్ ఎడిటింగ్ కూడా ఫరవాలేదనిపిస్తుంది. ఈ సినిమా విడుదలను చూడకముందే దర్శకుడు సురేశ్ సంగయ్య మరణించడం బాధాకరం. వినోదం కాస్త తక్కువైనా, సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తూ సామాజిక సందేశాన్ని చెప్పాలన్న ఆయన ప్రయత్నం ప్రశంసించదగ్గది.
ఫైనల్ థాట్
నీటి కోసం తవ్విన బావిలో డైనోసార్ బయటపడటం ఎంత విచిత్రమో… అంతే విచిత్రంగా ఈ సినిమాలో కథ కోసం లోతుగా తవ్వితే, ఒకేసారి చాలా ఐడియాలు బయటపడతాయి. కానీ వాటిలో ఏదీ పూర్తిగా రూపుదాల్చదు. జీవంలేని డైనోసార్ లాగానే ఉంటాయి. కదులు,మెదులు లేకుండా.
ఎక్కడ చూడవచ్చు
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది








