బెబ్బులి దెబ్బ.. ఏలూరు జిల్లాలో హైటెన్షన్..!
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న పెద్దపులి (Tiger) తాజాగా బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. మండల పరిధిలోని నిమ్మలగూడెం శివారులో గల పాలకుంట చెరువు సమీపంలో పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పాలకుంట చెరువు వద్ద మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్దపులి ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ దాడిలో రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి.
సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగు జాడలను (Pugmarks) పరిశీలించారు. పశువుల మరణంతో స్థానిక రైతులు, గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో బుట్టాయగూడెం మండలం మరియు పరిసర గిరిజన గ్రామాల్లో అటవీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గ్రామాల్లో మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
సమీపంలోని అటవీ ప్రాంతాలకు, పొలాలకు ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని గిరిజనులకు గట్టిగా సూచించారు. అయితే, ఈ పులి కదలికలను ట్రాక్ చేయడం అధికారులకు కొంత సులువైంది. ఈ పులికి ముందే ‘రేడియో కాలర్’ (Radio Collar) అమర్చి ఉండటంతో, శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా అది ఎటు వైపు వెళ్తోంది అనే విషయాన్ని అటవీ శాఖ ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. పులిని తిరిగి అడవిలోకి పంపించేందుకు లేదా పట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎవరూ అధైర్యపడకూడదని అధికారులు వెల్లడించారు.








