పుస్తకం పట్టుకుంటే జైలు… అయినా చదివింది! చివరకు ప్రపంచం ఆమెను చదువుతోంది!
—శివ దువ్వూరు
అక్షరమే ఆయుధంగా.. అణచివేత చీకట్లను చీల్చి, ఒక తరానికే వెలుగులు పంచిన వీరనారి కథ ఇది చదువుకోవడమే నేరమైన చోట, చదువు చెప్పడమే ఘోరమైన చోట.. ఒక 14 ఏళ్ల బాలిక సృష్టించిన ప్రభంజనం ఇది!
ఈ రోజుల్లో మనం చేతిలో ఫోన్లు పట్టుకుని, నచ్చిన బుక్స్ కొనుక్కుని, ఎంచక్కా చదువుకుంటున్నాం. కానీ, ఒకప్పుడు ఆ దేశంలో చదువుకోవడమే పెద్ద క్రైమ్. స్కూల్‌కు వెళ్లడం, పుస్తకాలు చదవడం, పరీక్షలు రాయడం… ఇవన్నీ ఆత్మహత్యా సదృశ్యాలు. అవును, మీరు వింటున్నది నిజమే!ఒకప్పుడు అలాంటి ప్రపంచంలో ఓ చిన్నారి జీవించింది. అయినా…
ఆమె ఆగలేదు.
దాక్కుని చదివింది.
భయాన్ని దిగమింగి ముందడుగు వేసింది.
చివరకు తాను మాత్రమే కాదు… ఒక తరం భవిష్యత్తునే వెలిగించింది.
“వెలుగు నిషేధించినా… ఉదయాన్ని ఎవ్వరూ ఆపలేరు.” అని నిరూపించింది. ఆమే సుసీ కింగ్ టేలర్. ఎవరీమె..ఏమిటా కథ.
ఇవి కూడా చదవండి
చీకట్లో చదివిన చిన్నారి… వెలుగులు పంచిన గురువు
1848లో అమెరికాలోని జార్జియాలో ఆమె బానిసగా జన్మించింది. ఆ రోజుల్లో నల్లజాతీయ పిల్లలకు చదువు చెప్పడం నేరం. అక్షరాలు నేర్పితే జైలు. పుస్తకం ఇస్తే శిక్ష. తెలివి పెంచితే ప్రమాదం. ఎందుకంటే… చదువుకున్న బానిస ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలు అడిగిన మనిషిని బానిసగా ఉంచడం కష్టం. అందుకే చదువును సంకెళ్లలో బంధించారు. కానీ ఆమె అమ్మమ్మ ఓ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
“నా మనవరాలు చదువుకోవాలి.” అంతే…
సుసీని రహస్య పాఠశాలకు పంపింది. ఏడేళ్ల వయసులో ఆటలాడుకోవాల్సిన ఆ చిన్నారి.. చదువు కోసం ప్రాణాలను పణంగా పెట్టింది. ఆ స్కూల్ అన్ని స్కూల్స్ లాంటిది కాదు…సీక్రెట్ స్కూల్. బయిట ప్రపంచానికి అనుమానం రాకుండా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్కసారి వెళ్లాలి. కలిసి గుంపుగా వెళ్తే అనుమానం వస్తుంది. అలాగే పుస్తకాలు బ్రౌన్ పేపర్లో దాచుకోవాలి. బయిట బోర్డులు ఉండవు. లోపల బ్లాక్ బోర్డ్ లు ఉండవు. చూస్తే సాధారణ ఇల్లు…లోపల మాత్రం విప్లవం జరుగుతోంది. అదే విద్య విప్లవం. అక్కడే సుసీ మొదటిసారి అక్షరాలతో స్నేహం చేసింది. దొంగలాగా నక్కి నక్కి వెళ్తూ.. నల్లజాతి మహిళలు నడిపే ‘సీక్రెట్ స్కూల్స్’ లో చదువుకోవటం మొదలెట్టింది.
“ఖడ్గం చేతిలో ఉంటే ఒకరిని గెలుస్తావు… అక్షరం చేతిలో ఉంటే జీవితాన్ని గెలుస్తావు.” అనే తన టీచర్ మాటలు తలకెక్కించుకుంది.
14 ఏళ్లకే టీచర్… 40 మందికి ఆశాకిరణం
కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తిరిగింది. 1862లో అమెరికాలో అంతర్యుద్ధం (సివిల్ వార్) మొదలైంది. యుద్ధం తెచ్చిన అలజడిలో, కేవలం 14 ఏళ్ల వయసున్న సుసీ.. శత్రువుల కళ్లు గప్పి ప్రాణాలతో యూనియన్ ఆర్మీ వైపు పారిపోయింది. చాలామంది ప్రాణాల కోసం పరుగెడుతుంటే…14 ఏళ్ల సుసీ మాత్రం మరో పోరాటానికి సిద్ధమైంది. ఆమె చదువుకుంది. ఇప్పుడు చదువు పంచాలి. అక్కడ వేల సంఖ్యలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన జనం ఉన్నారు. కానీ, ఎవరికీ చదువు రాదు.
అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్లు ఈ పద్నాల్గేళ్ల అమ్మాయికి చదువు వచ్చని తెలుసుకుని ఆశ్చర్యపోయారు! “నువ్వు వీళ్లందరికీ స్కూల్ పెట్టి చదువు చెప్తావా?” అని అడిగారు. అంతే.. ఆ చిన్నారి సై అంది! జార్జియా చరిత్రలోనే నల్లజాతీయుల కోసం ఓపెన్‌గా స్కూల్ నడిపిన మొదటి నల్లజాతి టీచర్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. పగలు 40 మంది పిల్లలకి, రాత్రి పూట జీవితాంతం చదువుకు దూరమైన పెద్దవాళ్లకి కొవ్వొత్తుల వెలుతురులో అక్షరాలు దిద్దించింది.
ఎందుకంటే… వారికి ఇన్నాళ్లేకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు వారికి చదువు కావాలి.సుసీ తన పుస్తకంతో వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ” శరీరానికి మాత్రమే వచ్చిన స్వేచ్ఛ ఆత్మకు కూడా రావాలంటే విద్య అవసరం.” అని ఆమెకు తెలుసు.
ఆ తర్వాత ఆమె ‘ఎడ్వర్డ్ కింగ్’ అనే ఆర్మీ ఆఫీసర్ని పెళ్లాడింది. భర్తతో పాటు ఆర్మీ క్యాంపుల్లోనే ఉంటూ.. ఏకంగా 4 ఏళ్ల 3 నెలల పాటు జీతం లేకుండా, ఎలాంటి ర్యాంక్ లేకుండా దేశానికి సేవ చేసింది. ఒకపక్క టైఫాయిడ్, స్మాల్‌పాక్స్ (అమ్మవారు) లాంటి రోగాలతో సైనికులు చనిపోతుంటే.. ప్రాణాలకు తెగించి వారికి నర్సుగా సేవలు చేసింది.
వరల్డ్ ఫేమస్ ‘రెడ్ క్రాస్’ ఫౌండర్ క్లారా బార్టన్తో కలిసి పని చేసింది. అవసరమైనప్పుడు తుపాకులు పట్టింది.. ఖాళీ దొరికితే సైనికులకు చదువు నేర్పింది. ఒక మహిళ, అదీ ఒక నల్లజాతి మహిళ.. ఇన్ని పనులు ఏకకాలంలో చేయడం ఒక అద్భుతం! “గొప్ప సేవలకు జీతం అవసరం లేదు… గొప్ప హృదయం చాలు. అని నిరూపించింది.
దేశం మర్చిపోయింది… చరిత్ర మాత్రం గుర్తుపెట్టుకుంది
యుద్ధం ముగిసింది.. సుసీ తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చింది. కానీ విధి ఆమెను మళ్లీ పరీక్షించింది. కొడుకు పుట్టకముందే భర్త చనిపోయాడు. అయినా గుండె నిబ్బరంతో మళ్లీ స్కూల్ పెట్టింది. ఆ తర్వాత కాలక్రమేణా ప్రభుత్వ స్కూళ్లు రావడంతో ఈమె స్కూల్ మూతపడింది. బతుకుదెరువు కోసం నార్త్ అమెరికా వెళ్ళి, అక్కడ ఒకరి ఇంట్లో పనిమనిషిగా (Domestic Servant) చేరింది.
దేశం కోసం అన్ని ఏళ్లు జీతం లేకుండా పని చేసినా, ఆ దేశ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి మిలిటరీ పెన్షన్ ఇవ్వలేదు సరే కదా.. కనీసం ఆమె సేవలను అధికారికంగా గుర్తించలేదు ! పురస్కారాలు ఇవ్వలేదు. సత్కారాలు చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే… దేశం ఆమెను మర్చిపోయింది.
కానీ సుసీ ఊరికే కూర్చోలేదు. తన జీవితంలో చూసిన యుద్ధాన్ని, అనుభవించిన కష్టాలను, బ్లాక్ సోల్జర్స్ చేసిన త్యాగాలను డైరీలా రాసి.. 1902లో ఒక బుక్ పబ్లిష్ చేసింది. అమెరికా సివిల్ వార్ గురించి ఒక నల్లజాతి మహిళ రాసిన ఏకైక హిస్టారికల్ రికార్డ్ అదే!
1912లో సుసీ కన్నుమూసింది. ఆమె చనిపోయేనాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాలేదు. కానీ, ఆమె రాసిన ఆ ఒక్క పుస్తకం.. ఈరోజు ప్రపంచ చరిత్రలోనే ఒక క్లాసిక్ గా నిలిచింది. మన భారతదేశంలో మహిళల చదువు కోసం సావిత్రిబాయి ఫూలే గారు ఎలాంటి పోరాటం చేశారో.. అమెరికాలో సుసీ కింగ్ టేలర్ అలాంటి విప్లవమే తెచ్చింది.
పుస్తకం పట్టుకున్న చిన్నారిని … చరిత్ర పట్టుకుంది
సుసీ కింగ్ టేలర్ కథ కేవలం ఒక మహిళ కథ కాదు. అది చదువుకున్న శక్తి కథ. అది ధైర్యం కథ. అది సంకెళ్లను తెంచుకున్న అక్షరాల కథ.
“సంకెళ్లలో పుట్టిన శరీరం బానిస కావచ్చు… కానీ అక్షరాలను తాకిన మనసు ఎప్పటికీ బానిస కాదు.”
చదువుకోవడానికి అన్ని సౌకర్యాలూ ఉన్న ఈ రోజుల్లో.. ఒక అక్షరం ముక్క కోసం, ఒక తరం భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఈ ‘బ్లాక్ సన్ ఫ్లవర్’ కథ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం!








