హర్మూజ్ పై పెత్తనం విషయంలో అమెరికా, ఇరాన్ భిన్న ప్రకటనలు..!
అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా హర్మూజ్ లో నౌకాయానం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. తమ విధానం అదేనని ప్రకటిస్తున్నారు. కాదని .. మొండిగా ప్రవర్తిస్తే.. ఇరాన్ పై దాడులు చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇటీవలి చర్చల్లోనూ అదే విషయాన్ని ప్రస్తావించామంటున్నారు ట్రంప్. అయితే ఆయన చెబుతున్నది అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. అమెరికాను తాము ఎప్పటికీ నమ్మబోమంటోంది ఇరాన్.
హర్మూజ్ నిర్వహణను ఇరానే (Iran) చూస్తుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి.. యుద్ధానికి ముందున్న స్థితికి ఎప్పటికీ తిరిగిరాదన్నారు.‘‘తాము అమెరికన్లను ఎన్నడూ నమ్మలేదు. ఇప్పుడూ నమ్మడం లేదు. భవిష్యత్తులోనూ వారిపట్ల ఆ ధోరణితో ఉండటం సమంజసమే’’ అని ఘాలిబఫ్ అమెరికా పట్ల ఇరాన్కున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్లో ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి తుది ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. కాగా.. తమ నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఇరాన్ అంగీకరిస్తే.. ఫ్రీజ్ చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ దేశం తాజా పరిణామాలపై స్పందించింది. అంతర్జాతీయ చట్టాలకు, టోల్ రహిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొంది.








