మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు మంత్రి లోకేష్ సత్కారం
రేపు పద్మశ్రీ అవార్డుల స్వీకారం… ఢిల్లీకి చేరుకున్న సీనియర్ నటులు
న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాగంటి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన 2026 పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించేందుకు డిల్లీకి వచ్చిన మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ లను మంత్రి లోకేష్ కలుసుకొని జ్ఞాపికలతో సత్కరించారు. వందలాది సినిమాల్లో నటించి, తెలుగు సినిమా రంగానికే వన్నెతెచ్చిన ఇద్దరు సీనియర్ నటులకు ఒకేసారి పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వ విఖ్యాత నటసర్వబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తో తమకు గల సాన్నిహిత్యాన్ని ఇద్దరూ నెమరువేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి సీనియర్ నటులు సేవలందించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు పార్లమెంటు సభ్యులు కూడా మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సన్మానించారు.








