పెట్రోల్ ధరలపై 60 రోజుల ‘సీజ్ ఫైర్’ డీల్..మన జేబుకు నిజంగా రిలీఫేనా??
—శివ దువ్వూరు
సాధారణంగా మనకు జీతం పెరగాలంటే కంపెనీ లాభాలు పెరగాలి. బాస్ మెచ్చాలి. ప్రమోషన్ రావాలి. నెలలు, ఏళ్లు ఎదురుచూడాలి. మొత్తానికి రకరకాల లెక్కలు కలిసిరావాలి. కానీ పెట్రోల్ ధర పెరగడానికి మాత్రం ప్రపంచంలో ఎక్కడో మొదలైన ఒక యుద్ధం చాలు.
అందుకే మిడిల్ ఈస్ట్‌లో వినిపించే ప్రతి బాంబు శబ్దం… భారతీయుడి జేబులో కూడా ప్రతిధ్వనిస్తోంది. అక్కడ ఉద్రిక్తత పెరిగితే ఇక్కడ ఖర్చుల మోత మోగుతోంది. అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే ఇక్కడ కుటుంబ బడ్జెట్ గాడి తప్పుతోంది. అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంటే చాలు… ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర టెన్షన్ మొదలవుతుంది.
గత కొద్ది రోజులుగా అదే భయం వెంటాడింది. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత పెరిగితే ఏం జరుగుతుందో, ప్రపంచ చమురు రక్తనాళమైన హోర్ముజ్ జలసంధి మూతపడితే పెట్రోల్ ధరలు ఎంత ఎగబాకుతాయోనని సామాన్యుడు ఆందోళన చెందాడు. అలాంటి సమయంలోనే ఒక ఊరటలాంటి వార్త వచ్చింది.
శత్రు దేశాలైన అమెరికా, ఇరాన్ ఒక మెట్టు దిగివచ్చాయి. కానీ, ఇది కేవలం 60 రోజుల ‘టెంపరరీ రిలీఫ్’ మాత్రమే. ఇంతకీ తెరవెనుక ఏం జరిగింది? ఇద్దరు బద్ధ శత్రువుల మధ్య ‘పాకిస్తాన్’ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? ఈ 60 రోజుల తర్వాత ఏం జరగబోతోంది?
సీక్రెట్ చర్చలు.. డైరెక్ట్ హాట్‌లైన్!
స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. సముద్రంలో పొరపాటున కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా ఉండేందుకు ఇరు దేశాలు ఒక ‘డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్’ (హాట్‌లైన్) ఏర్పాటు చేసుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఖతార్‌తో పాటు మన దాయాది దేశం ‘పాకిస్తాన్’ ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ గుండా వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించేలా ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.
ట్రంప్ ఎంట్రీ.. హై-డ్రామా!
అయితే ఈ చర్చలు అనుకున్నంత సాఫీగా ఏమీ జరగలేదు. మీటింగ్ మొదలవుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇరాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. “ఒప్పందం కుదరకపోతే సముద్రంలో వెళ్లే ప్రతి నౌక నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం, మా దాడులు ఎలా ఉంటాయో చూపిస్తాం” అని హెచ్చరించారు.
దీంతో స్విట్జర్లాండ్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్ బృందం చర్చలను 80 నిమిషాల పాటు ఆపేసి మరీ తమ అధిష్టానంతో సీక్రెట్‌గా మాట్లాడుకుంది. “కాస్త జాగ్రత్తగా ఉండండి, బదులివ్వడానికి మేం ఎప్పుడూ సిద్ధమే” అని ఇరాన్ ప్రతినిధి, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు.
ఈ ’60 రోజుల’ డీల్ ఏంటి?
జూన్ 17న డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ రిమోట్ విధానంలో ఒక 14-పాయింట్ల అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. దీనినే ‘ఇస్లామాబాద్ మెమోరాండం’ అంటున్నారు. ఇందులో కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు ఇవే:
ఫ్రీ పాస్: రాబోయే 60 రోజుల పాటు హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు.
ఆంక్షల సడలింపు: ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఉన్న అమెరికా ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేశారు.
కొత్త కమిటీ: ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా, ఇరాన్, లెబనాన్లతో కలిపి ఒక ‘డీ-కాన్ఫ్లిక్షన్ సెల్’ ఏర్పాటు చేశారు.
అణు బాంబులు: తాము అణు ఆయుధాలు తయారు చేయబోమని ఇరాన్ మళ్లీ స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న యురేనియంను అంతర్జాతీయ పర్యవేక్షణలో తగ్గిస్తామని ఒప్పుకుంది.
పెట్రోల్ ధరలకు బ్రేక్.. మన దేశానికి లాభం!
ఈ మొత్తం ఎపిసోడ్లో మన దేశానికి జరిగిన అతి పెద్ద మేలు ‘చమురు ధరలు తగ్గడం’. ప్రపంచ చమురు రవాణాలో హోర్ముజ్ జలసంధి చాలా కీలకం. ఇరాన్ దాన్ని బ్లాక్ చేసి ఉంటే, గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ సప్లై ఆగిపోయి, ఇండియాలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగేవి.
యుద్ధ భయంతో మొన్నటిదాకా బ్యారెల్ క్రూడాయిల్ ధర $100 డాలర్లు దాటేసింది. కానీ ఇప్పుడు ఈ శాంతి ఒప్పందంతో అది దాదాపు $80 డాలర్లకి పడిపోయి స్థిరపడింది. మార్కెట్లకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇది ఇలాగే కొనసాగితే మన దేశంలో చమురు ధరలు పెరిగే ఛాన్స్ ఉండదు.
ముందుంది అసలు టెన్షన్..
పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోపల అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. చర్చల తర్వాత పాకిస్తాన్, అమెరికా ప్రతినిధులతో కలిసి మీడియా ముందుకు రావడానికి, ఫోటోలు దిగడానికి కూడా ఇరాన్ అధికారులు ఆసక్తి చూపలేదు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న తీవ్రమైన అపనమ్మకానికి నిదర్శనం.
అసలైన సమస్యలైన ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల పూర్తి తొలగింపు, సముద్ర మార్గంపై శాశ్వత హక్కులు వంటి క్లిష్టమైన విషయాలను ఈ 60 రోజుల్లో తేల్చుకోవాలి. ఈ 60 రోజుల తర్వాత ఒప్పందం సక్సెస్ అవుతుందా? లేక గడువు ముగిశాక మళ్లీ తుపాకులు గర్జిస్తాయా? అనేది వేచి చూడాలి. ప్రస్తుతం అయితే, ఈ 60 రోజులు ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోవచ్చు!








