ఏపీకి అమరావతి ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మారాలన్నదే మా లక్ష్యం :మంత్రి లోకేష్
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్… ఇవే మా విజయ రహస్యాలు!
2028 నాటికి అమరావతిలో ప్రభుత్వ భవనాలన్నీ సిద్ధం చేస్తాం
ఐటీ, ఏఐ, క్వాంటం…అంతా చంద్రబాబే… నాడ్యూటీ ఎగ్జిక్యూషన్ మాత్రమే
మేం ప్రాంతీయ పార్టీయే అయినా జాతీయ భావంతోనే పనిచేస్తాం
2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే బాబు విజన్
రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో మంత్రి నారా లోకేష్ మనోగతం
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలు ఏపీవైపు మొగ్గుచూపడానికి మూడు “ఎస్” లు ప్రధాన కారణం. స్పీడ్ (వేగం), స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ)…ఈ మూడే మా విజయ రహస్యాలు, దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13నెలల్లో పనులు ప్రారంభించింది, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 17నెలల్లో, స్వదేశీ ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్టు ఏఎంసీఏ 37రోజుల్లో పనులు ప్రారంభించాయి, ఆ వేగమే ఆంధ్రప్రదేశ్ ను దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రిపబ్లిక్ టీవీ నిర్వహించిన కాంక్లేవ్ కు అతిధిగా హాజరైన మంత్రి నారా లోకేష్ రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే స్పష్టమైన విజన్ మా ముఖ్యమంత్రికి ఉంది. ఆయనకి ఎప్పుడూ పనులు వేగంగా జరిగిపోవాలి. అలాంటి బాస్ ఉన్నప్పుడు, ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమేనని అన్నారు. నా ఏకైక లక్ష్యం ఉద్యోగాల సృష్టే. ఇదే నన్ను పగలు, రాత్రి నిద్రపోనివ్వకుండా మరింత కష్టపడేలా చేస్తోందని చెప్పారు. కాంక్లేవ్ సందర్భంగా మంత్రి లోకేష్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ లో ఆర్నబ్ ప్రశ్నలు – మంత్రి లోకేష్ సమాధానాలు
ఆర్నబ్ గోస్వామి: మీ నాన్నగారు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. అది బహుశా 90ల చివర్లో అనుకుంటా. అప్పట్లో మాలాంటి రిపోర్టర్లతో చంద్రబాబు గారు చాలా మంచిగా ఉండేవారు. మేం ఏదైనా అడిగేయగల చనువు ఉండేది. మా ప్రశ్నలు కాస్త విసుగు తెప్పించేలా ఉండేవి. అయినా సరే, ఆయన మా కోసం ఎప్పుడూ టైమ్ కేటాయించేవారు. మిమ్మల్ని ఈ వేదిక మీద చూస్తుంటే నాకు ఆ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. మీలో మీ నాన్నగారి పోలికలు కనిపిస్తున్నాయి. కొత్తతరం పాలనకు ప్రతిరూపంగా నిలుస్తున్న మీతో ఇలా వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. లోకేష్‌ను ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణం ఆయన మున్ముందు చాలా విజయాలు సాధించబోతున్నాడన్న నమ్మకమే. ఆయనతో మాట్లాడి ఆయన్ని అర్థం చేసుకునే అవకాశం నాకు దొరికింది. అందుకే లోకేష్, జనాలు మిమ్మల్ని ఇంకాస్త దగ్గరగా తెలుసుకోవాలి అని భావిస్తున్నాను. ఆయన చుట్టూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ (ఎక్స్-ఫ్యాక్టర్) ఉంది. ఇక్కడ ఎక్కువగా బయట కనిపించని, దేశం కోసం అద్భుతాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. గ్లోబల్ రేంజ్లో ఉన్న టీవీఎస్ (TVS) కంపెనీని నడుపుతున్న సుదర్శన్ వేణు గారున్నారు, ఆయన జాతీయ వేదికల మీద పెద్దగా కనిపించరు. అలాగే జోహో (Zoho) ద్వారా అద్భుతాలు సృష్టిస్తున్న శ్రీధర్ వేంబు గారున్నారు. ఐఐటీ మద్రాస్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చిన ప్రొఫెసర్ కామకోటి కూడా రాబోతున్నారు. నా దృష్టిలో వీళ్లంతా ఒకే కోవకు చెందినవాళ్లు. ఒక చిన్న ప్రశ్నతో లోకేష్ తో సంభాషణ మొదలుపెడతాను. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ప్రస్తుతం మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది? గడిచిన పదేళ్లను ఎలా చూస్తారు? రాబోయే పదేళ్లకు మీ విజన్ ఏంటి?
నారా లోకేష్: వ్యక్తిగతంగా చెప్పాలంటే, ఇదొక అద్భుతమైన ప్రయాణం. మీరు చెప్పినట్లు, ఇదొక జర్నీ మాత్రమే, డెస్టినేషన్ కాదు. నేను ఇప్పుడే ఏ స్థాయిలో ఉన్నానో చెప్పడం కరెక్ట్ కాదు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నాకింకా 40-50 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉందని నేను నమ్ముతున్నాను. గత పదేళ్లు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. విజయాలు వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నానో, పరాజయాలను కూడా అంతే సమానంగా తీసుకున్నాను. లోకేష్ ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు, అందులో ఎలాంటి మార్పూ లేదు. కానీ మన దేశానికి ఇప్పుడు గొప్ప అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో యువ నాయకులు ముందుకొచ్చి, బాధ్యతలు భుజానికెత్తుకుని తమ సామర్థ్యాన్ని చూపించాలి. నా రాజకీయ ప్రయాణంలో నేను చేయాలనుకుంటున్నది అదే.
ఆర్నబ్ గోస్వామి: మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మీ దృష్టంతా పని చేయించడంలోనే (ఎగ్జిక్యూషన్) ఉంటుందని గతంలో నేను మీతో మాట్లాడినప్పుడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మీరు లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ ఏంటి?
నారా లోకేష్: నేను పని చేస్తున్న ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. కాబట్టి ఒకటే ప్రాజెక్ట్ అని చెప్పలేను. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే స్పష్టమైన విజన్ మా ముఖ్యమంత్రికి ఉంది. ఆయనకి ఎప్పుడూ పనులు వేగంగా జరిగిపోవాలి. అలాంటి బాస్ ఉన్నప్పుడు, ఆయన వేగాన్ని అందుకోవడం చాలా కష్టమే. కానీ నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను రెండు ముఖ్యమైన శాఖలు చూస్తున్నాను. ఒకటి భారత్ పోర్ట్‌ఫోలియో (విద్య), రెండోది ఇండియా పోర్ట్‌ఫోలియో (పెట్టుబడులు ఆకర్షించడం, ఉద్యోగాల సృష్టి). ఈ రెండింటిలోనూ నేను చేస్తున్న పని ఏపీని మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా నిలబెడుతుంది, అలాగే దేశానికి ఒక కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుంది.
ఆర్నబ్ గోస్వామి: మరి మీ బాస్ మీకు పెట్టిన టార్గెట్ ఏంటి?
నారా లోకేష్: ఆయన ఆలోచన చాలా క్లియర్. మనం 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలి. అంటే.. మనం ఏటా 15% (CAGR) వృద్ధి సాధించాలి. దీనికి అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి నేనే ఛైర్మన్‌ను. కాబట్టి, ఇప్పుడు నా ఏకైక లక్ష్యం ఉద్యోగాల సృష్టే. ఇదే నన్ను పగలు, రాత్రి నిద్రపోనివ్వకుండా మరింత కష్టపడేలా చేస్తోంది.
ఆర్నబ్ గోస్వామి: ఇందాక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వచ్చారు, అందరూ పెట్టుబడుల గురించే మాట్లాడుతున్నారు. అసలు పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి ఉన్న ప్రత్యేకత ఏంటి?
నారా లోకేష్: నేను మూడు ‘S’ల గురించి చెబుతాను. పారిశ్రామికవేత్తలు ఎపివైపు మొగ్గుచూపడానికి మూడు “ఎస్” లు ప్రధాన కారణం. స్పీడ్ (వేగం), స్టెబిలిటీ (స్థిరత్వం), సర్వీస్ (సేవ)…ఈ మూడే మా విజయ రహస్యాలు, దేశచరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ డేటా సెంటర్ కేవలం 13నెలల్లో పనులు ప్రారంభించింది, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 17నెలల్లో, స్వదేశీ ఫైటర్ జెట్స్ తయారీ ప్రాజెక్టు ఏఎంసీఏ 37రోజుల్లో పనులు ప్రారంభించాయి, ఆ వేగమే ఆంధ్రప్రదేశ్ ను దేశంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. రెండోది స్టెబిలిటీ. మా నాయకుడికి ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన తీసుకొచ్చిన విధానాలు ఎప్పటికీ ఏపీని ప్రత్యేకంగా నిలబడతాయి, మేం వాటిని అమలు చేసి చూపించాం కూడా. మూడోది సర్వీస్. వ్యాపారవేత్తలను నేను దేశ నిర్మాతలుగా చూస్తాను. వారు ఉద్యోగాలు ఇస్తారు, దేశాన్ని నిర్మిస్తారు. రాజకీయ నాయకుడిగా మీకు సేవ చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే నా ఉద్దేశం. ఈ మూడు ‘S’ లే ఏపీని ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా చూపిస్తున్నాయి. అందుకే ఈరోజు దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% కేవలం ఏపీకే వస్తున్నాయి. ఇది ఏపీని దేశంలోనే ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఆర్నబ్ గోస్వామి: అప్పటికీ ఇప్పటికి వ్యాపారానికి, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధంలో వచ్చిన మార్పేంటి? మీ జనరేషన్ వాళ్లు దీన్ని ఎలా చూస్తున్నారు? అప్పట్లో ఉన్నట్లు ఇప్పుడు పరాన్న జీవిత్వం, ఆశ్రిత పక్షపాతం లేవు. కేవలం పనితీరు (పెర్ఫార్మన్స్) మీదే ఆధారపడి ఉంది కదా?
నారా లోకేష్: అవును అర్నాబ్ జీ, ఒక నాయకుడితో 15-20 ఏళ్లు కలిసి ప్రయాణించాక, మనమంతా ఆయనకు కార్బన్ కాపీలా మారిపోతాం. ఆ వర్క్ కల్చర్ మనకూ వస్తుంది. మేం ప్రాంతీయ పార్టీ అయినా ఎప్పుడూ దేశం గురించే ఆలోచించాం. మా విధానాల వల్ల దేశానికి లాభం చేకూరింది. వ్యాపారవేత్తలు దేశ నిర్మాతలు, వాళ్లు జాబ్స్ ఇస్తారు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తారు. అయితే, వాళ్ల పెట్టుబడుల కోసం ఏపీ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. నేను మాత్రం నా మూడు ‘S’లతో వాళ్లను ఆకర్షిస్తున్నాను. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలు చాలా పెద్దవి, వాళ్లకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం కావాలి. నేను చేస్తోంది అదే. వాళ్ల ప్రాజెక్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్లు పెట్టుబడులు పెడితేనే మా దగ్గర ఉద్యోగాలు వస్తాయి, స్థానికంగా ఆర్థిక వృద్ధి జరుగుతుంది.
ఆర్నబ్ గోస్వామి: నాది మరొక సూటి ప్రశ్న ఉంది. ఎన్డీయేలో మీరే అత్యధిక ఎంపీలున్న మిత్రపక్షం కాబట్టి, మీకు ఢిల్లీలో స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతోందన్న ప్రచారం ఉంది. ఇది నిజమేనా? ఇంకో విషయమేంటంటే.. అమరావతికి నిధులన్నీ కేంద్రం నుంచే వస్తున్నాయని ఢిల్లీలో ఒక టాక్ ఉంది. కానీ అది నిజం కాదని, రాష్ట్రమే సొంతంగా నిధులు సమకూర్చుకుందని నేను విన్నాను. దీనిపై మీరు క్లారిటీ ఇస్తారా?
నారా లోకేష్: అర్నాబ్ జీ, ఎక్కువ మంది ఎంపీలు ఉంటే మన మాట గట్టిగా వినిపించడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ దానివల్ల రాష్ట్రానికి, నాకు ఏం లాభం కలిగింది? ప్రధానితో కలిసి డిన్నర్ చేసే అవకాశం దొరికింది. మోదీ గారు చాలా ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు. ఆయన విజన్ ఏంటో నాకు అర్థమైంది. కేంద్రం అద్భుతమైన పాలసీలు తీసుకొస్తోంది. ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు, కానీ ఆచరణలో పెట్టాల్సింది రాష్ట్రాలే. ఆ విషయంలో ఏపీ మిగతా రాష్ట్రాల కంటే చాలా వేగంగా ముందుకెళ్తోంది, అందుకే మాకు తగిన గుర్తింపు వస్తోంది. ఇతర రాష్ట్రాలు సైలెంట్‌గా ఉన్నప్పుడు, నేను డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి ‘మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి, మా దగ్గర భూమి రెడీగా ఉంది’ అని అడిగితే ఆయనెందుకు కాదంటారు? 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమి ఇచ్చాం, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదే మా స్పీడ్. ప్రధాని కూడా ఇలా స్పీడ్‌గా పనిచేసే రాష్ట్రాల వైపే చూస్తున్నారు. రాష్ట్రాలు పోటీ పడితేనే దేశం గెలుస్తుందని నా నమ్మకం. అమరావతి విషయానికొస్తే.. ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి వాళ్లు మొదట 12-13 వేల కోట్ల స్టార్టప్ క్యాపిటల్ ఇచ్చారు. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. మేమే సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నాం. ఇదొక సెల్ఫ్-ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. దేశం గర్వపడేలా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నాం. ఇకపై మనం విదేశాల్లోని నగరాల గురించి కాదు, ఇండియాలోని అమరావతి గురించే మాట్లాడుకుంటాం. అదే మమ్మల్ని మిగతా రాష్ట్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఆర్నబ్ గోస్వామి: స్టార్టప్ క్యాపిటల్ కాకుండా మీరెంత ఫండ్స్ రైజ్ చేశారు? ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మీకున్న పట్టుదల, దానికి పెట్టుకున్న టైమ్‌లైన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్నికల కోసమే రాజకీయ నాయకులు పనులు పూర్తి చేస్తారన్న విమర్శలు ఉంటాయి కదా, దానిపై మీరేమంటారు?
నారా లోకేష్: మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. ప్రాజెక్టులన్నీ రీస్టార్ట్ చేసినందున, మేం ప్రధానికి ఓ మాట ఇచ్చాం. 2028 నాటికి అమరావతిలోని అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు లాంటి ప్రభుత్వ భవనాలన్నీ సిద్ధం చేస్తాం. ఇది మేం ఇచ్చిన మాట, కచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇక రాజధాని కోసం 60వేల కోట్లు సేకరించబోతున్నాం. కేవలం ప్రభుత్వ భవనాలే కాదు. ఇప్పటికే బిట్స్ (BITS) వాళ్లు తమ క్యాంపస్ నిర్మిస్తున్నారు, వచ్చే ఏడాది అడ్మిషన్లు కూడా స్టార్ట్ అవుతాయి. వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఆసుపత్రులు, హోటళ్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వస్తున్నాయి. అమరావతి కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితం కాకుండా, ఏపీకి ఒక ఆర్థిక శక్తిగా (ఎకనామిక్ పవర్‌హౌస్‌గా) మారాలన్నదే మా లక్ష్యం. నేను ఇందాక చెప్పిన 2.4 ట్రిలియన్ ఎకానమీ అనేది ఒకే నగరంతో సాధ్యం కాదు. అందుకే విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను వేర్వేరు ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖను ఐటీ, డేటా సెంటర్లకు కేరాఫ్‌గా మార్చుతున్నాం. అమరావతిలో క్వాంటం ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఇక రాయలసీమ (తిరుపతి ప్రాంతం) లో మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ) రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. రాజధాని అమరావతే అయినా, మిగతా రాష్ట్రాన్ని కూడా సమానంగా అభివృద్ధి చేస్తున్నాం.
నిరంజన్ (వ్యాఖాత): లోకేష్ గారూ, జస్ట్ క్యాజువల్‌గా అడుగుతున్నా. గతంలో మేం మాజీ ముఖ్యమంత్రిని పిలవడానికి వైజాగ్ వెళ్లినప్పుడు, అక్కడి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. కొత్త రాజధానులు కట్టే హడావుడిలో అసలు విషయాలు మర్చిపోయారు. ఇంకో విషయం ఏంటంటే, ఎన్డీయే-1 సమయంలో ఉన్న టీడీపీకి, ఇప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది. అప్పట్లో మీ ఎంపీలు చాలామంది వయసు పైబడిన వాళ్లు, వివాదాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మీ ఎంపీలు చాలా యంగ్‌గా ఉన్నారు. 40 ఏళ్ల వాళ్లే ఇక్కడ యూత్ లీడర్స్ అని చెప్పుకుంటుంటే, మీ ఎంపీల్లో 30 ఏళ్ల వారు ఉన్నారు. పార్టీలో మార్పుకోసం ఇది మీరు కావాలని చేస్తున్న పనా? దీని వల్ల మీకు వర్కౌట్ అవుతోందా?
నారా లోకేష్: ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని మార్పులు తప్పవు. మా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. వాళ్లు 40 ఏళ్ల పాటు పార్టీని నడిపించారు. ఇప్పుడు కొత్త తరం నాయకత్వం రావాలని వాళ్లే చాలాసార్లు చెప్పారు. మేం ఆ మార్పే చేశాం. గత ఎన్నికల్లో గెలిచిన మా ఎమ్మెల్యేల్లో 50% మంది, మంత్రుల్లో 17 మంది ఫస్ట్ టైమర్లే. మన దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంటరీ బృందం మాదే. రామ్మోహన్ నాయుడు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన క్యాబినెట్ మంత్రి. యువత ఆకాంక్షలు రాజకీయాల్లో ప్రతిబింబించాలంటే ఈ మార్పు చాలా అవసరం. మేం ప్రాంతీయ పార్టీయే అయినా జాతీయ భావంతోనే పనిచేస్తాం.
నిరంజన్ (వ్యాఖ్యాత): మీ నాన్నగారు ఏపీకి ‘ఐటీ’ (IT) ని పరిచయం చేసిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చాలా ప్రోగ్రెసివ్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు కూడా అదే దారిలో ‘ఏఐ’ (AI) ని ప్రమోట్ చేస్తున్నారు. చంద్రబాబు గారు ఐటీ అయితే, లోకేష్ ఏఐ అన్నమాట. ఇది మీ ప్లాన్ ప్రకారం జరుగుతోందా? మీకు ఇదెంత ముఖ్యం?
నారా లోకేష్: మా ముఖ్యమంత్రి గురించి తెలిసిన వాళ్లకి అర్థమవుతుంది, ఆయన మా కోసం క్రెడిట్ ఏమీ వదిలిపెట్టరు. ఐటీ ఆయనే, ఏఐ ఆయనే, క్వాంటం కూడా ఆయనే. ఆయన నాకేం వదిలిపెట్టలేదు. కానీ నా డ్యూటీ ఏంటంటే, ఆయన చూపించిన దారిలో పనులు అమలు చేయడం (ఎగ్జిక్యూషన్). ఆయనొక బ్రాండ్, ఆ బ్రాండ్ వల్లే మాకు గూగుల్ లాంటి పెద్ద కంపెనీల తలుపులు తెరుచుకున్నాయి. నేను ఆ బ్రాండ్‌ను వాడుకున్నాను, ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, ఏడాదిలోపు ఆ డేటా సెంటర్‌ను దేశానికి అంకితం చేస్తాం. అదే మమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇప్పుడు నాయుడు గారి 4.0 (నాలుగోసారి సీఎం) పాలన నడుస్తోంది. ఆయన మొదటి మూడు టర్మ్స్ కంటే ఇది పూర్తిగా డిఫరెంట్. నేను సరదాగా మా యువ బృందంతో అంటుంటాను.. ‘నాయుడు గారు ఎప్పుడూ 1995 నాటి తన టీమ్ గురించి గొప్పగా చెబుతుంటారు కదా, రేపొద్దున ఆయన 2024 టీమ్ ఇంకా అద్భుతం రా అని మన గురించి చెప్పుకునేలా మనం కష్టపడి పనిచేయాలి’ అని. అదే మమ్మల్ని పగలు, రాత్రి కష్టపడేలా ముందుకు నడిపిస్తోంది.
ఆర్నబ్ గోస్వామి: చాలా ఇంట్రెస్టింగ్ సెషన్ ఇది. లోకేష్ గారూ, ఇండియాలో అందరూ ఆసక్తిగా గమనిస్తున్న సెకండ్ జనరేషన్ లీడర్ మీరు. మీ నాన్నగారి నీడలో నుంచి బయటికొచ్చి, టెక్నాలజీ తెలిసిన లీడర్‌గా మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నందుకు కంగ్రాట్స్. ఏపీని డేటా సెంటర్లకు కేరాఫ్‌గా మారుస్తున్నారు కదా. కానీ వీటికి కరెంటు, నీళ్లు చాలా అవసరం. దీనివల్ల స్థానికులకు ఇబ్బంది కలగొచ్చు కదా. మరి ఈ సమస్యను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? భవిష్యత్తు కోసం ఇప్పుడే ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
నారా లోకేష్: అర్నాబ్ జీ, ఈ డెవలప్మెంట్లో రైతులను, స్థానికులను భాగస్వాములను చేయడం చాలా ముఖ్యం. వాళ్లకు వాస్తవాలు వివరించాలి. ఉదాహరణకు, డేటా సెంటర్లకు నీళ్లు కావాలి నిజమే. కానీ ప్రతి ఏటా గోదావరి నుంచి 3వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నీళ్లు బ్రెజిల్ లేదా వియత్నాం దేశమంతా ఏడాది పాటు వాడే నీటితో సమానం. డేటా సెంటర్ లకు అడుగుతున్నది కేవలం 1.5 టీఎంసీలే. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ నీటిని వాడుకుంటాం. రెండోది, పవర్ విషయానికొస్తే మన దేశంలో ‘వన్ గ్రిడ్’ విధానం ఉంది. మా ఏపీ దక్షిణ ప్రాంతంలో చాలా సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి డేటా సెంటర్లకు పవర్ ఇచ్చుకోవచ్చు. అలాగే, ఏఐ (AI) విషయంలో మనదేశానికి సొంత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం.
ఆర్నబ్ గోస్వామి: దీని కోసం మీరు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారా?
నారా లోకేష్: కచ్చితంగా. ఏపీలో ఈ ఏడాది పవర్ వాడకం ఏకంగా 17% పెరిగింది. దేశంలో ఇదే హయ్యెస్ట్. దీనికి తగ్గట్లు మేం ప్లాన్ చేసుకోవాలి. ప్రాజెక్టులన్నీ గ్రౌండింగ్ కాకముందే మేం ఇంత స్పీడ్‌గా వెళ్తున్నాం అంటే, ఫ్యూచర్ కోసం పవర్, వాటర్ ఎలా మేనేజ్ చేయాలో ఇప్పుడే ప్లాన్ చేసుకుంటున్నాం. మా మంత్రులంతా దీనిపైనే ఫోకస్ చేస్తున్నారు.
ఆర్నబ్ గోస్వామి: ఇక్కడో చిన్న కాంట్రాడిక్షన్ ఏంటంటే, గతంలో పాలిటిక్స్ అంటే ఓటర్లను బుజ్జగించడమే. కానీ మీరు రియల్-టైమ్ గవర్నెన్స్ అంటారు. మీ దగ్గర ఒక ఫైటర్ జెట్ కాక్‌పిట్ లాంటి డ్యాష్‌బోర్డ్ ఉందని విన్నాను. ఇదంతా నిజంగా పాజిబుల్ అవుతుందా? లేక ఇదొక అట్రాక్టివ్ మార్కెటింగ్ పదమా? సగటు మనిషికి దీనివల్ల యూజ్ ఏంటి?
నారా లోకేష్: ఒక ఆసక్తికరమైన నిజం చెబుతాను వినండి. 2024లో మేం అధికారంలోకి వచ్చేనాటికి ఏపీలో అక్షరాస్యత రేటు చాలా దారుణంగా ఉంది. ఐటీలో అంత పేరున్న రాష్ట్రంలో ఇలా జరగడం విచిత్రం కదా? ఎందుకంటే, గత ఐదేళ్లలో పాలకులు అసలు మానిటరింగ్ చేయలేదు. డ్రాపౌట్స్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు, విద్యా శాఖ మంత్రి ఒక డేటాను ఎలా చూస్తారో, గ్రౌండ్ లెవెల్లో ఉన్న హెడ్మాస్టర్ కూడా అదే డేటాను చూస్తారు. దీనివల్ల రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ ఏడాదే దాదాపు 85,000 మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌కి వచ్చారు. ఈ డేటా ఉంటేనే నేను కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలను. ఏ స్కూల్లో, ఏ సబ్జెక్టులో ఎవరు వీక్ ఉన్నారో నాకు అమరావతిలో కూర్చుంటే తెలిసిపోతుంది. ప్రైవేట్ సెక్టార్ చేయగలిగినప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు? నా దగ్గర అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్.. ఇలా అన్ని శాఖల డేటా ఉంటుంది. దాన్ని బట్టే మేం పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాం.
ఆర్నబ్ గోస్వామి: మీరు స్టాన్ఫోర్డ్ వెళ్లాక రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారా?
నారా లోకేష్: స్టాన్ఫోర్డ్ వెళ్లకముందే నాకు పాలిటిక్స్‌లోకి రావాలని ఆసక్తిఉంది. స్టాన్ఫోర్డ్ ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నానో వ్యాసం రాయమని అడిగినపుడు ఈ విషయం ప్రస్తావించాను. ప్రైవేట్ సెక్టార్ నుంచి పబ్లిక్ సెక్టార్‌కి మారేందుకు ఈ ఎంబీఏ నాకు యూజ్ అవుతుందని రాశాను. చాలామంది నన్నీ ప్రశ్న అడుగుతుంటారు. 2004 ఎన్నికల్లో నాయుడు గారు ఎన్నికల్లో ఓడిపోయారు. సరిగ్గా ఏడాది తర్వాత ఆయనతో కలిసి ఓ పెళ్లికి వెళ్లాను. అక్కడ దాదాపు 5,000 మంది ఉన్నారు. నాయుడు గారు లోపలికి రాగానే, అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది, ఇంతటి గౌరవం దక్కేది రాజకీయాల్లోనే అని. అదే నన్ను రాజకీయాల వైపు నడిపించింది.
ఆర్నబ్ గోస్వామి: నిజం చెప్పాలంటే ఆ గౌరవానికి ఆయన కచ్చితంగా అర్హులు. అందరు నాయకులకూ ఆ రెస్పెక్ట్ దక్కదు. నాకైతే ఈ సంభాషణ చాలా బాగా అనిపించింది. మీలో చాలా పాజిటివిటీ ఉంది. ముందు ముందు మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో దేశం కచ్చితంగా చూడాల్సిన నాయకుడు నారా లోకేష్. థ్యాంక్ యూ సో మచ్, నారా లోకేష్ గారూ.








