ఏపీలో ‘భవారియా గ్యాంగ్’ ఎంట్రీ..!
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా అప్పికట్ల రైల్వే స్టేషన్ సమీపంలో కలకలం రేపిన రైలు దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ ఘోర దోపిడీకి పాల్పడింది దేశవ్యాప్తంగా నేరాలకు ఒడిగట్టే రాజస్థాన్‌కు చెందిన ప్రమాదకరమైన ‘భవారియా గ్యాంగ్’ (Bhavaria Gang) అని పోలీసులు నిర్ధారించారు. ఈ ముఠాకు చెందిన కీలక నిందితుడు సోనును పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడ(Kakinada) పోర్ట్‌కు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు అర్ధరాత్రి దాటాక బాపట్ల శివారు నల్లమడ వాగు వంతెన సమీపానికి రాగానే దుండగులు చైన్ లాగి నిలిపివేశారు.
అనంతరం ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. ప్రయాణికులు కేకలు వేయడంతో ఎస్కార్ట్ విధుల్లో ఉన్న అప్రమత్తమై, పారిపోతున్న దొంగలపైకి ఏకంగా 9 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం అప్పట్లో తీవ్ర సంచలనమైంది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు జరిపి రాజస్థాన్ రాష్ట్రం హనుమాన్‌ఘడ్ జిల్లాకు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు, ప్రస్తుతం పట్టుబడిన సోను నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.
ఇతర రాష్ట్రాల ముఠాలు కోస్తా జిల్లాల్లోని రైళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ దోపిడీ ముఠాలో సోనుతో పాటు రాజ్వీర్, లక్కన్, సీతారాం, వినోద్, మిథున్ అనే సభ్యులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడు సోను పోలీసుల అదుపులో ఉండగా, తప్పించుకుని పరారీలో ఉన్న మరో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల కోసం రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ముఠా అరెస్టుతో కోస్తా తీర ప్రాంత రైల్వే ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.








