ఐపీఎల్లో భారీ ట్రేడింగ్ డీల్..!
ఐపీఎల్లో మరో భారీ సంచలనానికి తెరలేవబోతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మళ్లీ ఫ్రాంచైజీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముంబై జట్టులో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, గత సీజన్లో పేలవమైన ప్రదర్శన కారణంగా హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో ముంబై ఇండియన్స్ (MI) యాజమాన్యం ప్రస్తుతం ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఈ మెగా ట్రేడింగ్ డీల్‌లో భాగంగా హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపి, దానికి బదులుగా వారి స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది.
జైస్వాల్ ముంబై రంజీ జట్టుకే ఆడుతుండటంతో, అతనికి ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడం కెరీర్ పరంగా కలిసివచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్‌లో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ దక్కడం, జట్టులో మరో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ దూసుకురావడంతో జైస్వాల్ కూడా కొత్త జట్టు వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశకు రావడం, హార్దిక్ పాండ్యాతో పాటు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైని వీడి వేరే ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండటంతో జట్టును పునర్నిర్మించాల్సిన అవసరం ముంబైకి ఏర్పడింది. అందుకే టీమిండియాలో మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న జైస్వాల్ వంటి యువ సూపర్ స్టార్‌ను జట్టులోకి తెచ్చుకోవడానికి ముంబై గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ‘రెవ్‌స్పోర్ట్స్’ (RevSportz) నివేదిక ప్రకారం, హార్దిక్ పాండ్యా టీమ్ ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంతో అడ్వాన్స్డ్ లెవెల్ చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ ట్రేడింగ్ డీల్ అధికారికంగా ఖరారైతే, ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన మరియు సంచలన ప్లేయర్ ఎక్స్ఛేంజ్ అవుతుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మార్పుల తర్వాత రాబోయే ఐపీఎల్ సీజన్ ఆటగాళ్ల ట్రేడింగ్ పరంగా మరింత ఆసక్తికరంగా మారనుంది.








