చంద్రబాబుకు కేశినేని నానీ సంచలన లేఖ..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) విజయవాడ(Vijayawada) మాజీ ఎంపీ కేశినేని నాని ఒక సంచలన లేఖ రాశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో భారీ ఎత్తున మట్టి కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లేఖ ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలవరం కుడి కాల్వ గట్టును భారీ యంత్రాలతో అక్రమంగా తవ్వి, అక్కడి నుంచి పెద్ద ఎత్తున మట్టిని తరలించారని కేశినేని నాని తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని అక్రమంగా తరలించారని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వందల కోట్ల రూపాయల చేతులు మారాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో ఈ మట్టి తవ్వకాలు, తరలింపు విలువ దాదాపు రూ. 350 కోట్ల వరకు ఉంటుందని మాజీ ఎంపీ అంచనా వేశారు. ఇంతటి భారీ కుంభకోణం కేవలం కొందరు స్థానిక అధికారుల అండదండలతోనే సాధ్యం కాదని, దీని వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టిన ఈ మెగా స్కామ్‌పై నిష్పక్షపాతంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించిన కీలక డీలింగ్స్ మరియు ప్రణాళికలన్నీ ఒక నిర్దిష్ట ప్రాంతంలో జరిగాయని కేశినేని నాని ఆధారాలతో సహా లేఖలో ప్రస్తావించారు. ‘రావూరి విస్టా’ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 301 ఇందుకు వేదికగా మారిందని ఆయన ఆరోపించారు. నిందితులను పట్టుకోవడానికి మరియు ఈ అక్రమ లావాదేవీల గుట్టు రట్టు చేయడానికి రావూరి విస్టా అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సిసిటివి (CCTV) ఫుటేజ్‌ను పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకుని పరిశీలించాలని లేఖలో ప్రత్యేకంగా డిమాండ్ చేశారు.








