కేన్స్ వేదికపై మెరిసిన ‘నక్షత్రం’ “ది గేమ్ ఆఫ్ సాంగ్” మూవీ టీజర్ విడుదల!
కేన్స్ (ఫ్రాన్స్): ప్రపంచ సినీ యవనికపై తెలుగు సినిమా ఖ్యాతి మరోసారి మార్మోగింది. ప్రతిష్టాత్మకమైన కేన్స్ అంతర్జాతీయ చలనచిత్ర వేదికగా “ది గేమ్ ఆఫ్ సాంగ్ (ఆటాడిన పాట’)” చిత్ర టీజర్, పోస్టర్ గ్రాండ్‌గా విడుదలయ్యాయి. అతిథిగా పాల్గొన్న లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (LIFF) ప్రోగ్రామింగ్ డైరెక్టర్ కారీ సాహ్నీ (Cary Sawhney) చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కారీ సాహ్నీ చిత్రయూనిట్ ప్రతిభను ప్రశంసించారు.
FICCI & NFDC ఆధ్వర్యంలో కేన్స్‌లో ఏర్పాటు చేసిన ‘భారత్ పెవిలియన్’లో ఈ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. నక్షత్రం ప్రొడక్షన్స్ నుంచి అవంతిక నక్షత్రం నిర్మించిన ఈ చిత్రానికి వేణు నక్షత్రం కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు భారతీయ భాషల్లో డబ్బింగ్ అవుతోంది.
నాచురల్ యాక్టర్ అభినవ్ గోమఠం, స్వాతి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పూర్తిగా సోషియో ఫాంటసీ జానర్లో, వినూత్న ప్రయోగంతో రూపొందింది. కేన్స్‌కు హాజరైన అంతర్జాతీయ సినీ ప్రముఖులు ఈ చిత్ర టీజర్‌ను వీక్షించి, చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఒక తెలుగు ప్రయోగాత్మక చిత్రం అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకోవడం విశేషం.
ఈ సందర్భంగా దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ.. “తెలుగు సినిమా గ్లోబల్ వేదికపై దూసుకుపోతున్న ఈ సమయంలో, మా చిత్రానికి కేన్స్‌లో అద్భుతమైన స్పందన రావడం చాలా గర్వంగా ఉంది. పలు భారతీయ భాషల్లోని ప్రేక్షకుల కోసం మా సినిమాను డబ్బింగ్ చేయిస్తున్నాము. డైరెక్టర్ శర్వికి, మా టీమ్ సభ్యులందరికి, చిత్ర నిర్మాణంలో సహకరించిన మిత్రులకు ధన్యవాదాలు.” అని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో తెలుగు సినిమా ప్రాభవం పెరుగుతున్న తరుణంలో, “ది గేమ్ ఆఫ్ సాంగ్” వంటి సినిమాలు గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి.







